బాలయ్యా.. ఇంక ఆపేయవయ్యా

బాలయ్యా.. ఇంక ఆపేయవయ్యా

సినిమా వేడుకల్లో నందమూరి బాలయ్య వేదిక ఎక్కాడంటే చాలు.. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. ఈ విషయంలో నందమూరి అభిమానులు ఫీలైనా ఇది వాస్తవం. సాధారణంగా బాలయ్య తన సినిమాల ఆడియో వేడుకకు వచ్చాడంటే.. ఎప్పుడూ ఒకే రకమైన ప్రసంగం చేస్తుంటాడు.

ఆడియో విజయం సాధిస్తే.. సినిమా సగం విజయం సాధించినట్లే అని మొదలుపెట్టి.. సంగీతానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. విశ్వామిత్రుడు మేనక నృత్యానికి మైమరిచిపోయాడని.. శ్రీకృష్ణుడి వేణు గానానికి గోవులు మోకరిల్లాయని.. ఇలా పురాణాల్లోకి వెళ్లిపోయి ప్రసంగాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంటాడు. కనీసం ఇప్పటిదాకా పది ఆడియో వేడుకల్లో అయినా బాలయ్య ఇదేే ప్రసంగాన్ని అరగదీసి ఉంటాడు.

తన సినిమాల వేడుకల్లోనే కాదు.. వేరే వాళ్ల సినిమాల ఫంక్షన్లకు వెళ్లినా బాలయ్య ఇంతే. గత ఏడాది ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌ కు వచ్చిన బాలయ్య అక్కడ సైతం ఇదే ప్రసంగాన్ని పునరావృతం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రస్తావన రాగానే.. నేనెప్పుడూ చెబుతూ ఉంటాను అంటూ.. తన పాత స్టయిల్లోకి వెళ్లిపోయాడు బాలయ్య.

తాజాగా బాలయ్య ‘రూలర్’ ఆడియో వేడుకలోనూ తన ట్రేడ్ మార్కు స్పీచ్‌ను దించేశాడు. ఈ వేడుకలో బాలయ్య దాదాపు అరగంట మాట్లాడటం విశేషం. ఒక టాపిక్ మొదలుపెట్టి.. ఇంకెక్కడికో వెళ్లిపోయి.. ఎప్పట్లాగే అభిమానుల్ని గందరగోళానికి గురి చేశాడు. అయినప్పటికీ ప్రసంగం సగం వరకు వెళ్లే దాకా పాత స్పీచ్‌ల్లోని విషయాలు ఎత్తకపోయేసరికి.. పర్వాలేదనుకున్నారు ఫ్యాన్స్. కానీ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ప్రస్తావన వచ్చిందో లేదో.. ఆయనకు మేనక, విశ్వామిత్రుడు, శ్రీకృష్ణుడు.. వేణుగానం.. గోవులు.. అన్నీ గుర్తుకొచ్చేశాయి. పాత రికార్డు బయటికి తీసి కొన్ని నిమిషాల పాటు వాయించి వదిలేశాడు.  

బాలయ్యకు ఎవ్వరూ చెప్పట్లేదో ఏంటో కానీ.. ప్రతిసారీ అరిగిపోయిన అవే మాటలు మాట్లాడుతూ ఆయన కామెడీ పీస్ అయిపోతున్నాడు. ఇది ఆయనకు చాలా డ్యామేజింగ్ అనడంలో సందేహం లేదు. లక్షల మంది చూసే వేడుకల్లో ప్రసంగాల విషయంలో బాలయ్య కాస్తయినా కసరత్తు చేసి రాకపోవడం విచారకరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English