తెలుగు ప్రేక్షకులు ఇంత కరవులో ఉన్నారా?

తెలుగు ప్రేక్షకులు ఇంత కరవులో ఉన్నారా?

ఈ రోజుల్లో ప్రేక్షకులు అంత సులువుగా థియేటర్లకు వెళ్లట్లేదు. సినిమా టాక్ ఏంటో తెలుసుకుని.. టికెట్ డబ్బులకు పూర్తి న్యాయం జరుగుతుందనుకుంటే తప్ప థియేటర్లకు కదలట్లేదు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాలకు వెళ్లాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు. ఇలాంటి టైంలో బ్యాడ్ రివ్యూలు, డివైడ్ టాక్‌తో మొదలైన సినిమాకు తొలి రోజే ఆక్యుపెన్సీ పడిపోతుంటుంది.
 
కానీ శుక్రవారం రిలీజైన 'వెంకీ మామ' థియేటర్ల దగ్గర మాత్రం దీనికి భిన్నమైన దృశ్యం కనిపించింది. మరీ రొటీన్‌గా, ఏమాత్రం కొత్తదనం లేకుండా పాత కథతో తీసిన 'వెంకీ మామ'కు రివ్యూలేవీ యావరేజ్‌ స్థాయిని మించలేదు. అందరూ సినిమా గురించి నెగెటివ్‌గానే మాట్లాడుతున్నారు. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా ఇలాగే ఉంది. వెంకటేష్-నాగచైతన్యల కాంబినేషన్లో సురేష్ ప్రొడక్షన్స్ ఇలాంటి సినిమా తీసిందేమిటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఐతే ఈ సినిమాకు టాక్ ఎలా ఉంటేనేమి.. వసూళ్లు మాత్రం అదిరిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఈ చిత్రం ప్యాక్డ్ హౌసెస్‌తో నడిచింది. ప్రధాన సెంటర్లలో ప్రతి థియేటర్ ముందూ హౌస్ ఫుల్ బోర్డు పడిపోయింది. మాస్ సెంటర్లలో బ్లాక్‌లో టికెట్లు అమ్మే పరిస్థితి వచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా 'వెంకీ మామ' థియేటర్లు ఇలా కళకళలాడిపోవడం ఆశ్చర్యమే. దీన్ని బట్టి ప్రేక్షకులు ఎలాంటి కరవులో ఉన్నారో అర్థమవుతుంది. దసరాకు వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' తర్వాత పెద్ద సినిమాలేవీ రాలేదు. ఈ రెండు నెలల్లో పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి.

వాటిలో 'అర్జున్ సురవరం' మినహా ఏ తెలుగు సినిమా నిలబడలేదు. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కొంచెం పెద్ద సినిమా అయ్యుండాలి. వెంకీకి కుటుంబ ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా 'వెంకీ మామ'పై ఆ వర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 'ఎఫ్-2' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నటించిన సినిమా కావడం, పైగా మేనల్లుడు చైతూతో చేసిన సినిమా కావడంతో సగటు ప్రేక్షకుడిలో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దీంతో టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English