మనసులో మాట బయటపెట్టారా?

జనగామ బహిరంగ సభలో కేసీయార్ తన మనసులోని మాటను బయట పెట్టేసినట్లేనా ? ఇపుడిదే చర్చ జరుగుతోంది. ఎప్పటినుండో కేసీయార్ కు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కోరిక బలంగా ఉంది. అందుకనే ఇతర ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతున్నది. ఎప్పటికప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పావులు కదపటానికి ప్రయత్నిస్తునే ఉన్నారు.
 
కేసీయార్ వేసే అడుగులు, మాటలు చూస్తుంటే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే బలమైన కోరిక ఉన్నట్లు అందరికీ అర్ధమైపోతోంది. తాజాగా జనగాం బహిరంగ సభలో మరోసారి తన మనసులోని కోరికను బయటపెట్టుకున్నారనే అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే జనగామ జనాలందరూ కోరుకుంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తానని చెప్పారు.  కేంద్రంపై కేసీయార్ యుద్ధం చేయాలని అనుకున్నా ఏ హోదాలో చేయగలరు ?
 
ముఖ్యమంత్రిగా ఉంటే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం సాధ్యం కాదు. కేంద్రంపై యుద్ధమంటే ప్రత్యక్షంగా ఢిల్లీలో ఉంటేనే సాధ్యమవుతుంది. అది సాధ్యమవ్వాలంటే ఎంపీగా వెళ్ళి ఢిల్లీలోనే కూర్చోవాలి. ఎంపీగా వెళ్ళాలంటే ప్రభుత్వ పగ్గాలను వారసులకు అప్పగించేయాల్సిందే కదా. ఇందులో భాగంగానే జనగామ జనాలను అడిగింది. కేసీయార్ ఢిల్లీకి వెళతానంటే జనగామ జనాలే కాదు తెలంగాణాలో ఎవరూ కాదనరు.
  
మొత్తానికి తొందరలోనే జాతీయ రాజకీయాల్లోకి కేసీయార్ ప్రవేశించటం ఖాయమనే అర్ధమైపోతోంది. అది లోక్ సభ ద్వారానా లేకపోతే రాజ్యసభ ద్వారానా అన్నదే తేలాలి. ఒకవైపు 2013 ఎన్నికలేమో వచ్చేస్తోంది. ఆ మరుసటి సంవత్సరమే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. తన ఆధ్వర్యంలోనే 2013 ఎన్నికల్లో మూడోసారి పార్టీని గెలిపించి ప్రభుత్వం పగ్గాలను వారసులకు అంటే కొడుకు కేటీయార్ కి  అప్పగించేసి హ్యాపీగా ఢిల్లీకి వెళిపోతారేమో.