సమీక్ష..వెంకీమామ: ఇదేంటి మామా?

సమీక్ష..వెంకీమామ: ఇదేంటి మామా?

నటీనటులు: వెంకటేష్ - నాగచైతన్య - రాశి ఖన్నా - పాయల్ రాజ్ పుత్ - ప్రకాష్ రాజ్ - నాజర్ - రావు రమేష్  - ఆదిత్య మీనన్ - కిషోర్ తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: సురేష్ బాబు
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బాబీ

1989...1999..2019..పలకడానికో, చూడ్డానికో, కాస్త దగ్గరగా వుండొచ్చు. కానీ ఒక్కోదానికి మధ్య పదేళ్ల గ్యాప్ వుంది. ఒక్కోదానికి మధ్య బెల్ బాటమ్ కు, స్కిన్ ఫిట్ కు మధ్య వున్నంత తేడా వుంది. 35ఎమ్ ఎమ్ కు 70 ఎమ్ఎమ్ కు వున్నంత డిఫరెన్స్ వుంది. అది తెలుసుకోకుండా, స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని, రంగంలోకి దిగిపోతే, ఇదిగో ఇలా అచ్చం వెంకీమామ సినిమా మాదిరిగా వుంటుంది.

సోదరి అష్టమ గర్భాన పుట్టే పిల్లాడి వల్ల గండం వుంది కనుక, ఆ పిల్లాడినే చంపేయాలనుకుంటాడు అలనాడు భాగవతంలో కంసుడు. అదే కంసుడు మేనల్లుడిని అపురూపంగా పెంచి, తను పోయినా ఫరవాలేదు, వాడు తనతోనే వుండాలనుకుంటే, ఇలా వచ్చిన ఆలోచనతో తయారైన స్క్రిప్ట్ నే వెంకీమామ.

ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా వుండడం, తన మేనల్లుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కనిపించడంతో సీనియర్ హీరో వెంకటేష్ వెంటనే సై అని వుంటారు. కానీ నిజానికి ఈ స్క్రిప్ట్ ఎన్నో మార్పులు, చేర్పులతో తెరకు ఎక్కిన తరువాతే ఇలా వుంటే, ఆరంభంలో ఎలా వుండి వుంటుందో? అది వెంకటేష్ ను, నిర్మాత సురేష్ బాబును ఎలా ఎగ్జయిట్ చేసి వుంటుందో అన్నది మాత్రం అంత సులువుగా జవాబు దొరకని ప్రశ్న.

జాతకచక్రం చూసి భవిష్యత్ అక్షరం పొల్లు పోకుండా చెప్పేయగల దిట్ట రామనారాయణ (నాజర్) ఆయన కొడుకు వెంకటరత్నం (వెంకటేష్). రామనారాయణ కూతరు, అల్లుడు ప్రమాదంలో మరణిస్తారు. వాళ్ల కొడుడు కార్తీక్ (నాగ్ చైతన్య). మేనల్లుడు అంటే వెంకటరత్నానికి ఆరోప్రాణం.  మనవడి వల్ల కొడుక్కి ప్రాణగండం వుందని తెలిసిన రామనారాయణ, కార్తీక్ ను ఎలాగైనా ఇంట్లోంచి పంపేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి నేపథ్యంలో కార్తీక్ వున్నట్లుండి ఇంటి నుంచి మాయమై మిలటరీ లో చేరతాడు. కార్తీక్ ను వెదుక్కుంటూ వెళ్తాడు వెంకటరత్నం. అప్పుడు ఏం జరిగింది? కార్తీక్ ఎందుకు వెళ్లాడు? అన్నది మిగిలిన సినిమా. ఇంతకన్నా కథగా చెప్పడానికి ఏమీ లేదు. ఈ కథకు ప్యాడింగ్ కోసం ఇద్దరు హీరోయిన్లు. అందులో ఒక హీరోయిన్ తండ్రి రాజకీయనాయకుడు కమ్ విలన్.

వెంకీమామ స్క్రిప్ట్ లో సమస్యలు చాలా వున్నాయి. సినిమా మొత్తం మీద ఇద్దరి హీరోలకు సరైన సీన్లు కొన్నయినా వున్నాయా అంటే అనుమానం కలుగుతుంది. సినిమా ఓపెనింగ్ షాట్ నుంచి చివరి షాట్ వరకు, ఇదిగో ఇది కొత్తగా ఆలోచించాం..ఇది కొత్తగా తీసాం..అని చెప్పే షాట్ ఒక్కటంటే ఒక్కటి వుంటే ఒట్టు. హీరోయిన్ ఫ్రెండ్స్ పట్టణం నుంచి పల్లెకు వచ్చి, హడావుడి చేయబోవడం, ఫూల్స్ గా మారి నవ్వులు పండించడం ఏనాటి విద్య ఇది? అమ్మాయి వచ్చీ రాని తెలుగు-హిందీ కలిసి మాట్లాడడం, హీరో హిందీ రాక డిల్ల మొహం వేయడం..ఇదేనాటి తతంగం? అసలు హీరో వెంకటేష్-రాశీఖన్నా అండ్ టీమ్ మధ్య నడిచిన కామెడీ కానీ, చైతన్య-పాయల్ రాజ్ పుత్ ల నడుమ నడిపిన కామెడీ కానీ చూస్తుంటే, అసలు నిర్మాతలు, హీరోలు ఓకె అనడం ఎలా జరిగి వుంటుందా? అన్న పెద్ద క్వశ్చను మార్కు కళ్ల ముందు వేలాడుతుంది.

సరైన పాయింట్ వుంది. మేనల్లుడి కోసం ప్రాణం అన్నా ఇచ్చేసే హీరో. కానీ ఆ హీరో ప్రాణానికే ముప్పు తెచ్చే మేనల్లుడి జాతకం. కానీ ఈ పాయింట్ ను పట్టుకుని, రెండు గంటల బలమైన సినిమాగా మార్చడం మాత్రం చేతకాలేదు.  కోనవెంకట్, జనార్థన మహర్షి, బాబీ ఇంకా మరో ఒకరో ఇద్దరో కలిసి వండిన వంటకం ఇది. వీరంతా టైమ్ మెషీన్ లో ఎక్కడో 1989 కి వెళ్లిపోయి, ఆకాలం సినిమాల ఆలోచనలు అన్నీ రంగరించి తెచ్చి పోసారు స్క్రిప్ట్ లో.

తొలిసగంలో ఆ పాతకాలం సీన్లు కాస్త బలవంతపు నవ్వులు రువ్విస్తాయి. వీటి మధ్య అప్పుడప్పుడు ఎమోషన్ సీన్లు పలకరించిపోతాయి. ద్వితీయార్థం లో అయితే రెండు యాక్షన్ సీన్లు తప్ప మేరేమీ లేదు. క్లయిమాక్స్ ఇంత సింపుల్ గా తీసేయవచ్చు అన్నది తెలియక, చాలా మంది దర్శకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటూ వుంటారు. వెంకీ మామ చూసి వాళ్లు నేర్చుకోవాలి. ఇలా చచ్చిపోయాడు అనిపించి అలా లేచి కూర్చో పెట్టేసి, జనాలను కూడా థియేటర్ల నుంచి బయటకు పంపేసాడు దర్శకుడు.

టోటల్ గా ఒక్క ముక్క లో చెప్పాలంటే, ఓ బలమైన పాయింట్ ను తీసుకుని, అత్యంత బలహీనమైన స్క్రిప్ట్ తయారు చేసి, బలమైన సార్ కాస్ట్ తో, బలహీనమైన సినిమాగా మార్చిన వ్యవహారమే వెంకీ మామ. సినిమాలో కాసిన్ని ఫన్ సీన్లు, అవి కూడా ఒకటి రెండు, అలాగే ఒకటి రెండు పాటలు తప్పిస్తే, ఫరవాలేదు అన్న వ్యవహారమే లేదు.

వెంకటేష్ సీనియర్ హీరోగా తన స్టయిల్ తాను ప్రదర్శించుకుంటూ వెళ్లాడు. చైతన్యకు చేయడానికి స్కోప్ తక్కువే. అయినా చేసాడు. హీరోయిన్లు కేవలం పాటల కోసం తయారు చేసిన పాత్రలు. వాటిని అలా వదిలేయకుండా కాసిన్ని సీన్లు అల్లారు.

సాంకేతికంగా సినిమాకు సరిపడా పనితనం వుంది తప్ప, బాగుంది, శహభాష్ అనే పనితనం ఏదీ, ఏ విభాగంలోనూ లేదు. దర్శకుడు బాబీ పనితనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. యంగ్ డైరక్టర్లు తమ టాలెంట్ ప్రదర్శిస్తూ, ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే, బాబీ ఒకేసారి పది మెట్లు జారిపోయి, కిందకు వచ్చేసారు.

ఫినిషింగ్ టచ్...ఇదేంటి మామా?
రేటింగ్- 2.5/5

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English