బాహుబలిని మించి అంటున్న రానా

బాహుబలిని మించి అంటున్న రానా

‘రుద్రమదేవి’ సినిమా వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఆ తర్వాత దర్శకుడు గుణశేఖర్ ఇంకో సినిమా మొదలుపెట్టలేదు. ఆయన పాత క్లాసిక్ మూవీ ‘భక్త ప్రహ్లాద’లోని విలన్ పాత్ర ‘హిరణ్య కశ్యప’ స్ఫూర్తితో ఓ భారీ చిత్రం చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ఒక పట్టాన మొదలు కావట్లేదు.

గుణశేఖర్ రెండేళ్ల కిందట్నుంచే ఈ సినిమా మీద పని చేస్తున్నాడు కానీ.. ఎంతకీ ప్రి ప్రొడక్షన్ పని పూర్తి కాలేదు. ఇది చివరి దశకు వచ్చిందన్న తరుణంలో లీడ్ రోల్ చేయాల్సిన రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వచ్చాయి. అతనీ సినిమా చేయడన్న ప్రచారం జరిగింది. దీనికి తోడు బడ్జెట్ కూడా ఒక సమస్యే అన్న చర్చ కూడా నడిచింది. దీంతో ‘హిరణ్య కశ్యప’పై సందేహాలు మరింత పెరిగాయి. ఐతే ఈ సినిమాపై ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదని అంటున్నాడు రానా.

‘హిరణ్య కశ్యప’ కచ్చితంగా తీస్తామని.. అది ‘బాహుబలి’ని మించేలా ఉంటుందని రానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఈ సినిమాను తీర్చిదిద్దనున్నట్లు రానా తెలిపాడు. దీని వల్లే సినిమా పట్టాలెక్కడానికి సమయం పడుతోందన్నాడు. సినిమా విజువల్స్ గొప్పగా ఉండటం కోసం వర్చువల్ రియాలిటీ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని.. దీనికోసం మెడికల్ టెక్నాలజీలో ఉత్తమమైన త్రీడీ స్కానింగ్ కంపెనీతో కలిసి వర్క్ చేస్తున్నామని రానా తెలిపాడు.

తమ సినిమాను ‘బాహుబలి’ కంటే గొప్పగా ఉండేలా రూపొందించాలని భావిస్తున్నామని.. 2020 చివరికి సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని రానా వెల్లడించాడు. సురేష్ బాబే ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లని అంటున్నారు. రానా ఈ సినిమా కోసం మళ్లీ బాడీ పెంచి బలంగా తయారయ్యే ప్రయత్నంలో ఉన్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English