మామా అల్లుళ్ల మీదే ఆశలన్నీ..

మామా అల్లుళ్ల మీదే ఆశలన్నీ..

టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఈ ఏడాది పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఏడాది ఆరంభంలో సంక్రాంతితోనే పెద్ద షాక్ తగిలింది. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఏడాది ద్వితీయార్ధంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సాహో’ నిరాశపరిచింది. ‘సైరా నరసింహారెడ్డి’ సైతం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇక ‘సైరా’ తర్వాత రెండు నెలలు ఎంత భారంగా గడిచాయో చూస్తుున్నాం. కనీస స్థాయిలో కూడా వసూళ్లు లేక.. థియేటర్ల మెయింటైనెన్స్ కూడా కష్టమైపోయిన దుస్థితి. ఇలాంటి తరుణంలో మళ్లీ బాక్సాఫీస్‌లో ఊపు తెస్తుందని అందరూ ఆశిస్తున్న సినిమా ‘వెంకీ మామ’. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. కేవలం ఆ చిత్ర బృందం మాత్రమే కాదు.. ఇండస్ట్రీ అంతా కూడా ఈ సినిమా మీద చాలా ఆశలతో ఉంది.

దిగ్గజ నిర్మాత రామానాయుడు కలలు కన్న వెంకటేష్-నాగచైతన్యల కాంబినేషన్లో సురేష్ బాబు నిర్మించిన చిత్రమిది. కమర్షియల్ చిత్రాలు బాగా తీస్తాడని పేరున్న బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్ని రసాలూ కలిపి తీసిన సినిమా ఇదని దీని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమైంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలన్నీ ఉండటంతో ఆ వర్గం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న సినిమా ఇదని భావిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌కు ఈ సినిమా హిట్ కావడం ప్రతిష్టాత్మకం. అందుకే ఈ సినిమాను జనరంజకంగా మలచడానికి అన్ని ప్రయత్నాలూ జరిగాయి. పాజిటివ్ బజ్ మధ్య వస్తున్న ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. అది వస్తే ఈ సినిమా వసూళ్ల మోత మోగించి.. మళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కళ తేవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English