అద్భుతం సృష్టించబోతున్నాం.. రజనీ రాజకీయంపై సోదరుడు

అద్భుతం సృష్టించబోతున్నాం.. రజనీ రాజకీయంపై సోదరుడు

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి రెండు దశాబ్దాల కిందట్నుంచి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన ఏ రోజూ విస్పష్టంగా రాజకీయారంగేట్రం గురించి మాట్లాడలేదు. జయలలిత, కరుణానిధిల మరణం తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పాడ్డాక కానీ ఆయనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కలగలేదు.

తన రాజకీయారంగేట్రం గురించి ప్రకటన అయితే చేశాడు కానీ.. పక్కాగా ఏ రోజు తాను పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేది మాత్రం వెల్లడించలేదు. మునుపటి కంటే వేగంగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ పోతున్న ఆయన.. రాజకీయాలపై అసలు సీరియస్‌గా ఉన్నాడా లేదా అనే సందేహాలు రేకెత్తిస్తున్నాడు. ఐతే వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక రజనీ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి నెలకొంది.

కానీ ఆయనేమో ‘దర్బార్’ తర్వాత శివ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టేస్తున్నాడు. ఇంకెప్పుడు రాజకీయ పార్టీని ప్రకటిస్తాడని అభిమానులు సందిగ్ధంలో ఉండగా.. రజనీ సోదరుడు సత్యనారాయణరావు వాళ్లకు కాస్త స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. గురువారం రజనీ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సత్యనారాయణరావు.. కొత్త ఏడాది మొదలైన కొన్ని రోజుల్లోనే రజనీ రాజకీయ పార్టీని ప్రకటించి.. దాని విధివిధానాల్ని తన ప్రణాళికల్ని వివరిస్తారని వెల్లడించారు.

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ తప్పకుండా పోటీ చేస్తాడని కూడా ఆయన చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో అద్భుతం సృష్టించబోతున్నాం అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారాయన. శివ దర్శకత్వంలో సినిమాను మూడు నెలల్లో పూర్తి చేసి.. ఈలోపే పార్టీని ప్రకటించి.. ఆ తర్వాత రాజకీయాలకే అంకితం కావాలని రజనీ యోచిస్తున్నట్లు సమాచారం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English