‘అర్జున్ రెడ్డి’ బాలా వెర్షన్‌ను ఏం చేయబోతున్నారంటే..

‘అర్జున్ రెడ్డి’ బాలా వెర్షన్‌ను ఏం చేయబోతున్నారంటే..

రెండేళ్ల కిందట ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన కొన్ని రోజులకే తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటన వచ్చేసింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ప్రధాన పాత్రలోో లెజెండరీ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో ఈ సినిమా తీయాలని సంకల్పించారు. చకచకా సన్నాహాలు మొదలుపెట్టి సినిమా తీసేశారు కూడా. కానీ ‘వర్మ’ పేరుతో తెరకెక్కిన ఆ సినిమా టీజర్ చూసిన వాళ్లకు దిమ్మదిరిగిపోయింది. ‘అర్జున్ రెడ్డి’కి బాలా తన పైత్యమంతా జోడించి తీసిన వెర్షన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసినా జనాల స్పందనలో మార్పు లేకపోయింది. అంతకంతకూ నెగెటివిటీ పెరిగిపోవడంతో బాలా స్థాయి ఏంటో చూడకుండా ఆయన తీసిన సినిమాను చెత్తబుట్టలో వేసేసింది నిర్మాణ సంస్థ.

‘అర్జున్ రెడ్డి’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన గిరీశయ్యను దర్శకుడిగా పెట్టి ‘ఆదిత్య వర్మ’ పేరుతో మళ్లీ ‘అర్జున్ రెడ్డి’ని కొత్తగా తీర్చిదిద్దారు. గత నెలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకాదరణ కూడా పొందింది. ఐతే బాలా తీసిన వెర్షన్‌ను ఏం చేశారన్నది ఎవరికీ తెలియలేదు. అది మరుగున పడినట్లే అని అంతా అనుకున్నారు. కానీ కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ చిత్రాన్ని ఎలాగోలా సొమ్ము చేసుకోవాలని చూస్తోందట నిర్మాణ సంస్థ. ‘అర్జున్ రెడ్డి’ బాలా వెర్షన్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వాళ్లకు అమ్మేశారట. మంచి రేటే వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ‘వర్మ’ నెట్ ఫ్లిక్స్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఐతే తన సినిమాను పక్కన పెట్టి.. ఇప్పుడిలా డిజిటల్లో రిలీజ్ చేయడం గురంచి బాలా ఏమంటాడు.. ఈ వెర్షన్ పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English