‘అర్జున్ రెడ్డి’ భామ.. బంపరాఫర్ పట్టేసిందిగా..

‘అర్జున్ రెడ్డి’ భామ.. బంపరాఫర్ పట్టేసిందిగా..

అర్జున్ రెడ్డి’ లాంటి సెన్సేషనల్ మూవీతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది షాలిని పాండే. థియేటర్ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె.. ఆ సినిమాలో తన ప్రత్యేకతను చాటుకుంది. పాత్రకు తగ్గట్లుగా బోల్డ్‌గానూ నటించి మెప్పించింది. లుక్స్ పరంగా యావరేజ్ అయినప్పటికీ పెర్ఫామెన్స్‌లో తిరుగులేకపోవడంతో షాలిని మంచి స్థాయిని అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ పాపం.. అమ్మడి కెరీర్ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. తెలుగులో ‘మహానటి’, ‘118’ లాంటి సినిమాల్లో నటించిన అనుకున్నంత పేరు రాలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ సరసన ఆమె నటించిన ‘ఇద్దరి లోకం ఒకటే’కు కూడా ఆశించినంత క్రేజ్ లేదు. టాలీవుడ్ కెరీర్ పట్ల ఆమె దాదాపుగా ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. తమిళంలో ఒకటీ అరా సినిమాలు చేసినా అవీ అంత మంచి ఫలితాన్నివ్వలేదు.

ఇలాంటి తరుణంలో షాలినికి బాలీవుడ్లో ఒక బంపర్ ఆఫర్ తగలడం విశేషం. అక్కడ రణ్వీర్ సింగ్ లాంటి పెద్ద హీరో సరసన ఆమెకు ఛాన్స్ వచ్చింది. వీళ్లిద్దరి కలయికలో హిందీలో ‘జయేష్ బాయ్ జోర్డార్’ అనే కామెడీ మూవీ తెరకెక్కనుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుండటం విశేషం. ఇంతకుముందు రణ్వీర్ సింగ్‌తో ‘బ్యాండ్ బాజా బారత్’ సినిమా తీసిన మనీశ్ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఆడిషన్లో షాలిని చాలా చురుగ్గా వ్యవహరించిందని.. తన హీరోయిన్ పాత్రకు ఆమే కరెక్ట్ అని అప్పుడే ఫిక్సయ్యానని మనీశ్ వర్మ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. యశ్ రాజ్ సంస్థలో రణ్వీర్‌కు జోడీగా సినిమా చేయనుండటం పట్ల షాలిని కూడా చాలా ఎగ్జైట్ అయింది. ఇది తనకు లైఫ్ టైం ఛాన్స్ అని చెప్పింది. మరి ఈ సినిమాతో బాలీవుడ్లో అయినా షాలినికి మంచి కెరీర్ ఉంటుందేమో చూడాాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English