'దృశ్యం' సినిమా స్టయిల్లో హత్య చేసి దొరికిపోయారు

'దృశ్యం' సినిమా స్టయిల్లో హత్య చేసి దొరికిపోయారు

సినిమా జనాల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. సినీ ఫక్కీలో దోపిడీ, హత్య అంటూ వార్తలు చదువుతుంటాం కదా.. సరిగ్గా సినిమాలో చూసినట్లే హత్యలు చేసి తెలివిగా తప్పించుకోవాలని చూసేవాళ్లూ ఉంటారు. కేరళలో ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. మలయాళంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'దృశ్యం' సినిమా నుంచి స్ఫూర్తి పొంది తన భార్యనే హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. అతడి పేరు ప్రేమ్.
 
ఎప్పుడో 25 ఏళ్ల కిందట తనతో కలిసి స్కూల్లో చదువుకున్న సునీత బేబీ అనే స్నేహితురాలు మూడేళ్ల కిందట మళ్లీ స్కూల్ రీయూనియన్లో కలవడం.. ఆమె భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉండటంతో ప్రేమ్‌తో మళ్లీ స్నేహం చిగురించడం.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలు కావడంతో ప్రేమ్ తన భార్య విద్య అడ్డు తొలగించుకోవాలని భావించాడు.

సెప్టెంబరు 21న సునీత సాయంతోనే విద్యను అతను హత్య చేశాడు. ఒక గెస్ట్ హౌస్‌కు పిలిపించి ఆమె హత్య చేసి శవాన్ని కనిపించకుండా మాయం చేశారు. ఐతే రెండు రోజుల తర్వాత ప్రేమ్ ఏమీ ఎరగనట్లు వెళ్లి పోలీస్ స్టేషన్లో భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. తన మొదటి భర్త నుంచి పుట్టిన కొడుకును చూసేందుకు ఆమె గోవా వెళ్లిందని.. ఆ తర్వాత కనిపించకుండా పోయిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. విద్య ఫోన్ కోసం ట్రేస్ చేస్తే అది ముంబయి-గోవా మార్గంలో ఒక చోట ఉన్నట్లు తేలడంతో ప్రేమ్ చెప్పింది నిజమే అనుకున్నారు పోలీసులు.

కానీ ఆ తర్వాత ప్రేమ్ తీరు సందేహాస్పదంగా ఉండటంతో తమదైన శైలిలో విచారణ జరిపి అసలు నిజం రాబట్టారు. 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో తాను హత్య చేసినట్లు.. సాక్ష్యాలు మాయం చేసి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు అతను వెల్లడించాడు. ఇందులో భాగంగానే ముంబయి-గోవా మార్గంలో భార్య ఫోన్ తీసుకెళ్లి పడేసినట్లు తెలిపాడు. విద్య చనిపోయిన మూడు నెలలకు పోలీసులు ఈ కేసును ఛేదించి ప్రేమ్, సునీతలను అరెస్టు చేశారు. 'దృశ్యం' స్ఫూర్తితో కేరళలో ఇంతకుముందు కూడా కొన్ని హత్యలు జరగడం గమనార్హం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English