మరిప్పుడు పేదలకు సినిమా ఎలా జగన్?

దాదాపు పది నెలల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. నిత్యావసరాలు సహా అన్ని ధరలు అమాంతం పెరిగిపోతున్న సమయంలో ఎన్నో ఏళ్ల కిందటి రేట్ల తాలూకు జీవోను బయటికి తీసి ఆ మేరకే టికెట్ల ధరలుండాలంటూ ప్రభుత్వం కొరడా ఝులిపించడం ఇండస్ట్రీకి పెద్ద షాక్. ఈ రోజుల్లో ఈ రేట్లేంటి అని ఎవరు వాదించినా.. హీరోలు పారితోషకాలు తగ్గించుకోవాలని.. బడ్జెట్లు నియంత్రించుకోమని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి తెచ్చారు అధికార పార్టీ నాయకులు, వారి మద్దతుదారులు.

అంతటితో ఆగకుండా పేదల కోసం టికెట్ల ధరలు తగ్గిస్తుంటే ఎందుకిలా తప్పుబడుతున్నారు.. మీరు ఆదాయం కోసం పేదల జేబులకు చిల్లు పెడతారా అంటూ ఎదురు దాడి చేశారు. చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఒక సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారు. పేదల కోసం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే కూడా తప్పుబడతారా అని ఆయన ప్రశ్నించారు.ఐతే ఇప్పుడు వర్తమానంలోకి వస్తే.. ఏపీలో టికెట్ల ధరలు సవరించబోతున్నారు.

ఇన్నాళ్లూ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పందించని ప్రభుత్వం.. ఇప్పుడు ఉన్నట్లుండి ఆలోచన మార్చేసుకుంది. చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు సీఎం జగన్‌ను కలవగానే వేగంగా పరిస్థితులు మారిపోయాయి. దీనికి సంబంధించిన కసరత్తు ఎప్పట్నుంచో జరుగుతుండొచ్చు గాక.. కానీ కదలిక వస్తున్నది ఇప్పుడే. మరి కొన్ని రోజుల్లోనే టికెట్ల రేట్లను పెంచుతూ జీవో ఇవ్వబోతున్నారు.

మామూలుగా టికెట్ల రేట్లను మిగతా రాష్ట్రాలతో సమానంగా పెంచడమే కాక.. పెద్ద సినిమాలకు వారం పాటు రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇవ్వబోతున్నారట. మరి ఇన్నాళ్లూ పేదల కోసం రేట్లు తగ్గించాం అంటూ ఒకటే ఊదరగొడుతూ.. తమ గోడు వెల్లబోసుకున్న సినిమా వాళ్లపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేసిన అధికార పార్టీ నాయకులు, వారి మద్దతుదారులు ఇప్పుడేం మాట్లాడతారన్నది ప్రశ్న. ఇలా పెరిగిపోయే రేట్లతో పేదలు ఇక సినిమాలు చూడటం ఎలాగో మరి?