కొత్తవి వద్దు.. పాతదే ముద్దు

కొత్తవి వద్దు.. పాతదే ముద్దు

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పరాజయ పరంపర కొనసాగుతోంది. రెండు నెలలుగా తెలుగు సినిమాలకు గడ్డు కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఆకట్టుకునే సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతుంటే.. వాటి మెయింటైనెన్స్ కూడా కష్టమైన పరిస్థితుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. దసరాకు వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత ఏ తెలుగు సినిమా కూడా ఓ మోస్తరుగా కూడా ఆడలేదు.

చివరికి నెల చివర్లో వచ్చిన ‘అర్జున్ సురవరం’ ఓ మోస్తరుగా ఆడింది. డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ సినిమా బాగానే నిలబడింది. వీకెండ్లో మంచి వసూళ్లతో సాగిన ‘అర్జున్ సురవరం’ ఆ తర్వాత వీక్ డేస్‌లోనూ పర్వాలేదనిపించింది. ఐతే గత వారం అరడజను దాకా కొత్త సినిమాలు రావడంతో రెండో వీకెండ్లో ఈ సినిమా నిలబడుతుందా అన్న సందేహాలు కలిగాయి.

కానీ అరడజను కొత్త చిత్రాల్లో ఏదీ కనీస స్థాయిలో కూడా ఆడలేదు. అన్నీ దారుణమైన టాక్ తెచ్చుకున్నాయి. వీకెండ్లోనే వసూళ్లు లేక అల్లాడిపోయాయి. ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ నటించిన ‘90 ఎంఎల్’ అతడి ఖాతాలో ఈ ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్‌ను జమ చేసింది. తొలి షో నుంచే పేలవమైన టాక్ రావడంతో ఈ సినిమా ఏ దశలోనూ పుంజుకోలేదు. ఇక కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటిస్తూ తనే నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’కు కూడా దారుణమైన ఫలితం వచ్చింది. ఈ సినిమాను కూడా తొలి షో నుంచే ప్రేక్షకులు తిరస్కరించారు. మిస్ మ్యాచ్, అశ్వమేధం, కలియుగ లాంటి సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేదు.

దీంతో గత వారాంతంలో కూడా ‘అర్జున్ సురవరం’ యే బాక్సాఫీస్ లీడర్‌ అయింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు కూడా పడిపోయాయి కానీ.. మిగతా వాటితో పోలిస్తే దాని పరిస్థితే నయం. ఇక శుక్రవారం రాబోయే ‘వెంకీ మామ’తో మళ్లీ బాక్సాఫీస్‌లో వేడి పుడుతుందని ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English