అప్పుడు ట్యాక్సీవాలా.. ఇప్పుడు అర్జున్ సురవరం

అప్పుడు ట్యాక్సీవాలా.. ఇప్పుడు అర్జున్ సురవరం

ఒక సినిమా మేకింగ్ దశలో ఆలస్యమైనా.. విడుదలకు సిద్ధమయ్యాక థియేటర్లలోకి దిగడంలో ఆలస్యం జరిగినా.. దాని మీద ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్ పడిపోతుంది జనాల్లో. ఇలాంటి సినిమాలు ఎలాగోలా బయటికి వచ్చినా.. ఆడిన దాఖలాలు చాలా తక్కువ. ఎప్పుడో ఒక సినిమా మాత్రమే ఇలాంటి నెగెటివిటీని తట్టుకుని ఆడుతుంటుంది. చాలా ఏళ్ల కిందట 'అరుంధతి' అనే సినిమా ఇలా అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ సెన్సేషనల్ హిట్టయింది.

రీసెంట్ హిస్టరీ తీసుకుంటే.. గత ఏడాది రెండు సినిమాలు చాలా ఆలస్యంగా విడుదలైనా నెగెటివిటీని తట్టుకుని నిలబడ్డాయి. 2018 ఆరంభంలో వచ్చిన 'భాగమతి' సినిమా మూడేళ్ల ముందు మొదలై.. చాలా ఆలస్యంగా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ విషయంలోనూ చాలా అడ్డంకులు ఎదుర్కొంది. చివరికి గత ఏడాది జనవరి 26న విడుదలై మంచి టాక్ తెచ్చుకుని సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇక గత ఏడాది చివర్లో వచ్చిన 'ట్యాక్సీవాలా' సినిమాదీ ఇదే పరిస్థితి. మేకింగ్‌లో ఆలస్యానికి తోడు విడుదలకు ముందే పైరసీ బారిన పడిన ఈ చిత్రంపై ఎవ్వరికీ ఆశల్లేవు. చిత్ర బృందం కూడా ఒక దశలో ఆశలు వదులుకున్నట్లే కనిపించింది. కానీ రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. సినిమా సూపర్ హిట్ రేంజికి వెళ్లింది. ఇప్పుడు నిఖిల్ సిద్దార్థ సినిమా 'అర్జున్ సురవరం' ఇదే జాబితాలోకి చేరింది. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడింది.

ఒక దశలో టైటిల్ ఇష్యూ సైతం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. అసలు విడుదలే కాదనుకున్న ఈ చిత్రాన్ని అతి కష్టం మీద గత నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. దీనికి ఏమంత మంచి టాక్ రాకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర నిలబడ్డం కష్టమే అనుకున్నారు. కానీ అన్ని అడ్డంకులూ దాటి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. నిర్మాతలతో పాటు బయ్యర్లందరికీ కూడా ఈ చిత్రం పెట్టుబడి వెనక్కి తేవడంతో పాాటు లాభాలు అందిస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English