బాలయ్య-వినాయక్.. పక్కా

బాలయ్య-వినాయక్.. పక్కా

నందమూరి బాలకృష్ణ-వి.వి.వినాయక్ కాంబినేషన్లో దశాబ్దంన్నర కిందట ‘చెన్నకేశవరెడ్డి’ అనే సినిమా వచ్చింది. ‘ఆది’ లాంటి సెన్సేషనల్ హిట్‌తో వినాయక్ దర్శకుడిగా పరిచయం అయిన వెంటనే అతణ్ని లాక్ చేసి బాలయ్య చేసిన సినిమా ఇది. ఇది తీసి పడేసే సినిమా కాదు. కానీ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నందమూరి అభిమానులు దీన్ని ప్రత్యేకంగానే చూస్తారు.

మళ్లీ బాలయ్య-వినాయక్ కలయిక కోసం చాలా ఏళ్లు ఎదురు చూశారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. వినాయక్ పూర్తిగా ఫామ్ కోల్పోయి ‘ఇంటిలిజెంట్’ లాంటి చెత్త సినిమా అందించే సమయానికి మళ్లీ బాలయ్యతో అతడి కాంబినేషన్ కుదిరే అవకాశాలు కనిపించాయి. వినాయక్‌తో ‘ఇంటిలిజెంట్’, బాలయ్యతో ‘జై సింహా’ సినిమాలు తీసిన సి.కళ్యాణే ఈ సినిమాను సెట్ చేశాడు.

బాలయ్య కూడా వినాయక్ ఫామ్ గురించి ఆలోచించకుండా ఈ సినిమా చేయడానికి సుముఖంగానే కనిపించాడు. కానీ కొన్ని నెలల పాటు కలిసి ప్రయాణించాక వినాయక్‌ నుంచి దూరం జరిగాడు బాలయ్య. అతడితో సినిమాను క్యాన్సిల్ చేసుకుని.. తనతో ‘జై సింహా’ తీసిన రవికుమార్‌తోనే ఇంకో సినిమా సెట్ చేసుకున్నాడు. అదే.. రూలర్. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా కళ్యాణే. మరి బాలయ్యతో వినాయక్ సినిమా ఏమైందన్నది ఎవరికీ అర్థం కాలేదు.

ఇదే విషయంపై కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘బాలయ్య-వినాయక్ కాంబినేషన్లో సినిమా తీయాలనే అనుకున్నాం. కానీ దానికి సరైన కథ దొరకలేదు. వినాయక్ చాలా కథలు తీసుకొచ్చాడు. అవేవీ సంతృప్తినివ్వలేదు. తన కథల విషయంలో వినాయకే అంత సంతోషంగా కనిపించలేదు. ఈలోపు రవికుమార్ ‘రూలర్’ కథతో వచ్చారు. ఆ సినిమాను పట్టాలెక్కించాం. ఐతే బాలయ్య-వినాయక్ సినిమా ఇక లేదనుకోవద్దు. కచ్చితంగా చేస్తాం. అది ‘చెన్నకేశవరెడ్డి’ని మించి ఉంటుంది’’ అని కళ్యాణ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English