దేవీని సతాయించేస్తున్న సుక్కు

దేవీని సతాయించేస్తున్న సుక్కు

దేవిశ్రీ ప్రసాద్ ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ ఎరుగని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెరీర్ ఆరంభ దశకు మించి ఇప్పుడు పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య కాలంలో అతడి సినిమాల ఆడియోల గురించి ఎన్నో విమర్శలొస్తున్నాయి. ఒక మూసలో పడి కొట్టుకుపోతున్నాడని.. కొత్తగా ట్యూన్లు చేయలేకపోతున్నాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘ఎంసీఏ’, ‘హలో గురూ ప్రేమ కోసమే’, ‘మహర్షి’ లాంటి సినిమాల ఆడియోలు దేవి స్థాయికి తగనివి అనడంలో మరో మాట లేదు.

ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ మ్యూజిక్ మరింతగా విమర్శల పాలవుతోంది. ప్రోమోల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ.. ఇంతకుముందు రిలీజ్ చేసిన రెండు పాటల ట్యూన్స్ కానీ కొత్తగా ఏమీ అనిపించలేదు. సోషల్ మీడియాలో దేవి మీద ఎన్నడూ లేని స్థాయిలో ట్రోల్స్ నడుస్తున్నాయి.

ఇంతకుముందు దేవి లేకుండా సినిమాలు చేయని దర్శకులు.. నెమ్మదిగా అతడి నుంచి దూరం అవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిన దర్శకుడు కొరటాల శివ. దేవిని కాదని.. నిన్నటి తరం మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను ఆయన ఎంచుకోవడం  ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన కంటే ముందు త్రివిక్రమ్ సైతం దేవికి దూరమయ్యాడు. ఇక దేవిని నమ్మి అతడితోనే కంటిన్యూ అవుతున్నది ఒక్క సుకుమార్ మాత్రమే. ఆయనెప్పుడు దేవిని వదిలేస్తాడా అని చూస్తున్నారు జనం. కానీ దేవితో సుక్కుది డీప్ రిలేషన్. అతడి ప్రతిభ మీద సుక్కుకు అపారమైన నమ్మకం.

అలాగని దేవి నుంచి మ్యూజిక్ తీసుకునే విషయంలో మాత్రం సుక్కు ఆషామాషీగా ఉండడట. మన మ్యూజిక్‌తో పాటు ప్రపంచ సంగీతంపై అపారమైన అవగాహన ఉన్న సుక్కు.. ఒక పట్టాన దేవి ట్యూన్లు ఓకే చేయడన్నది ఆయన సన్నిహితుల సమాచారం. ఒక పాట కోసం కనీసం 50 ట్యూన్లు దాకా చేస్తాడట దేవి. తాను కోరుకున్నట్లు, కాస్త భిన్నంగా ట్యూన్ వచ్చే వరకు సుక్కు ఓకే చెప్పడట. అల్లు అర్జున్‌తో చేయబోయే కొత్త సినిమా విషయంలో మరింత కఠినంగా ఉంటున్నాడని.. దేవిని విపరీతంగా సతాయించేస్తున్నాడని.. కొన్ని నెలల పాటు సంగీత చర్చలు జరిగాక రెండు పాటలు ఓకే అయ్యాయని.. అవి చాలా బాగా వచ్చాయని.. దేవి తన విమర్శకులకు ఈ సినిమాతో సమాధానం చెప్పడం ఖాయమని అంటున్నాయి చిత్ర వర్గాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English