గ్రేటెస్ట్ 'మెగా' ఫ్యాన్ ఇక లేడు

గ్రేటెస్ట్ 'మెగా' ఫ్యాన్ ఇక లేడు

నూర్ భాయ్.. మెగా అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. చిరంజీవి సహా మెగా హీరోల్ని అభిమానించే లక్షలు, కోట్ల మంది అబిమానుల్లో ఇతణ్ని నంబర్ వన్ ఫ్యాన్‌గా పేర్కొంటారు. చిరు సహా అందరూ ఈ వీరాభిమానిని గుర్తిస్తారు. అతనెప్పుడు తమను కలవడానికి వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తారు. అతణ్ని ఒక కుటుంబ సభ్యుడిలాగా చూస్తారు. సోషల్ మీడియాలోనూ సూపర్ పాపులర్ అయిన ఈ గ్రేటెస్ట్ మెగా ఫ్యాన్ చనిపోవడం అభిమానుల్నే కాదు.. మెగా ఫ్యామిలీని విషాదంలో ముంచెత్తింది. ఈ ఉదయం నుంచి నూర్ భాయ్ పేరు సోషల్ మీడియలో ట్రెండ్ అవుతోంది. ఆయన మృతికి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన నూర్ భాయ్ దశాబ్దాలుగా మెగా హీరోలకు డెడికేటెడ్‌ ఫ్యాన్‌గా ఉంటున్నాడు. అతడి కుటుంబ సభ్యులందరూ కూడా చిరు అండ్ కోకు వీరాభిమానులే. చాలా ఏళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న నూర్ ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు నూర్‌కు ట్విట్టర్లో నివాళి అర్పించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితర మెగా హీరోలతో నూర్ చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థ తరఫున కూడా నూర్‌కు నివాళి అర్పించారు. టాలీవుడ్ పీఆర్వోలందరూ కూడా నూర్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు వేశారు. ఒక అభిమాని మృతి ఇంత పెద్ద వార్త అయిందంటే.. అతడి అభిమానం ఏ స్థాయిదో.. అతను మెగా ఫ్యామిలీపై ఏ స్థాయిలో ప్రేమను చూపించాడో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English