కేజీఎఫ్.. డిజిటల్ ప్రకంపనలు

కేజీఎఫ్.. డిజిటల్ ప్రకంపనలు

పోయినేడాది ఇదే సమయానికి కేజీఎఫ్ అనే సినిమా గురించి పెద్ద చర్చ నడిచింది. తొలిసారిగా ఓకన్నడ సినిమాను ఒకేసారి కన్నడతో పాటు తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతుంటే.. శాండిల్ వుడ్ సినిమాకు అంత సీనుందా అని చాలామంది ఎద్దేవా చేశారు. దీని ట్రైలర్ బాగున్నప్పటికీ కర్ణాటకను దాటి వేరే ప్రాంతాల్లో ఈ చిత్రం అంత ప్రభావం చూపించకపోవచ్చని.. యశ్ అనే హీరో సినిమా చూడ్డానికి వేరే భాషల వాళ్లు ఏం ఆసక్తి చూపిస్తారని సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఐతే క్రిస్మస్ కానుకగా విడుదలైన ఆ చిత్రం మరీ గొప్ప టాక్ రాకపోయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది. కన్నడ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టడమే కాదు.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ అద్భుతమైన వసూళ్లు సాధించి అందరినీ విస్మయపరిచింది.

రోజులు గడిచేకొద్దీ దీని వసూళ్లు పెరిగాయి. ఇక థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాత ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తే జనాలు మరింత ఎగబడి చూశారు. థియేటర్లలో సినిమా మిస్సయిన వాళ్లందరూ ఆన్ లైన్ రిలీజ్ కోసం ఎదురు చూసి మరీ.. ఈ చిత్రం ప్రైమ్‌లోకి రాగానే దూకేశారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి భారీ వ్యూస్ లభించాయి. ఇప్పటికీ ఈ సినిమాకు వ్యూస్ కొనసాగుతూనే ఉన్నాయి.

విశేషం ఏంటంటే.. 2019లో ఇండియాలో అత్యధిక డిజిటల్ వ్యూస్ దక్కించుకున్న సినిమా ఇదేనట. నంబర్ ఎంత అన్నది బయటికి రాలేదు కానీ.. ఈ ఏడాది ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి అత్యధిక మంది వీక్షించిన సినిమా మాత్రం 'కేజీఎఫ్'యే అని తేలింది. 'సాహో' సహా ఈ ఏడాది వివిధ భాషల్లో భారీ చిత్రాలు ఎన్నో రిలీజయ్యాయి. అలాంటిది అన్ని సినిమాలనూ వెనక్కి నెట్టి కన్నడ నుంచి వచ్చి వేర్వేరు భాషల్లో రిలీజైన ఓ సినిమా నంబర్ వన్‌గా నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English