ఆ భారీ సినిమా మునిగిందా తేలిందా?

ఆ భారీ సినిమా మునిగిందా తేలిందా?

'బాహుబలి' తరహా విజయం కోసం బాలీవుడ్ వాళ్లు భారీ ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నారు. కానీ అవి 'బాహుబలి' దరిదాపుల్లోకి వెళ్లకపోగా.. పెట్టుబడిని వెనక్కి తేవడం కూడా కష్టమవుతోంది. 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్', 'కళంక్' లాంటి భారీ చిత్రాల ఫలితాలేంటో తెలిసిందే.

'బాజీరావు మస్తానీ', 'పద్మావత్' లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. మంచి విజయమే సాధించినప్పటికీ.. వసూళ్లలో 'బాహుబలి'కి కనీస పోటీని ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు 'పానిపట్' అనే భారీ చిత్రం మీద బాలీవుడ్ వాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదైనా 'బాహుబలి' తరహా మ్యాజిక్ చేస్తుందేమో అని ఆశ పడ్డారు. కానీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ.. సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా అన్నది సందేహంగానే ఉంది.

ఇంతకుముందు 'లగాన్', 'జోదా అక్బర్', 'మొహెంజదారో' లాంటి భారీ చిత్రాలు తీసిన అశుతోష్ గోవారికర్ తీర్చిదిద్దిన చిత్రమిది. ఇందులో 'లగాన్' మినహా సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. 'మొహెంజదారో' ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. అశుతోష్ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల్ని సిన్సియర్‌గానే తీస్తాడు కానీ.. మన రాజమౌళిలా దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువ చేసే నైపుణ్యం అతడికి లేదు.

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పానిపట్ యుద్ధం ఆధారంగా అతను తీసిన 'పానిపట్' గురించి ఓ వర్గం విమర్శకులు పాజిటివ్‌గా మాట్లాడారు. దీన్ని ఒక క్లాసిక్‌ లాగా అభివర్ణించారు. అదే సమయంలో కొందరు క్రిటిక్స్ మాత్రం ఇది బోరింగ్ మూవీ అని.. మూడు గంటల పాటు ఈ సినిమాను భరించడం సామాన్య ప్రేక్షకుడికి కష్టమే అని అంటున్నారు. ఓపెనింగ్స్ మరీ భారీగా రాలేదు. తీసిపడేసేలానూ లేవు. వీకెండ్ అయ్యాక మాత్రం సినిమా నిలబడటం కష్టమే అన్నది ట్రేడ్ వర్గాల మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English