బాలయ్య కోసం ఈసారి ఫస్ట్ గ్రేడే?

బాలయ్య కోసం ఈసారి ఫస్ట్ గ్రేడే?

సీనియర్ హీరోలకు హీరోయిన్లు సెట్ చేయడం చాలా కష్టమైపోతోంది ఈ మధ్య. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మాదిరి తమ వయసులో మూడో వంతు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తరం హీరోలు మొహమాట పడుతున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి జోడీల్ని అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.

'ఖైదీ నంబర్ 150'లో చిరంజీవి-కాజల్.. 'మన్మథుడు-2'లో నాగార్జున-రకుల్ ప్రీత్ జోడీలు ఆడ్‌గానే కనిపించాయి. నయనతార, అనుష్క, త్రిష, శ్రియ లాంటి వయసు మళ్లిన హీరోయిన్లు బాగానే ఉంటారు కానీ.. నయన్ మినహా అందరికీ క్రేజ్ పడిపోయింది. నయన్‌ను అయినా.. మిగతా హీరోయిన్లనైనా ఈ హీరోల పక్కన మళ్లీ మళ్లీ చూపించడమన్నా కూడాా కష్టమే. దీంతో సెకండ్ గ్రేడ్ హీరోయిన్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

ముఖ్యంగా బాలయ్య గత కొన్నేళ్లలో నటించిన చాలా సినిమాల్లో సెకండ్ గ్రేడ్ హీరోయిన్లను పెట్టుకున్నాడు. 'జై సింహా'లో హరిప్రియ, నటాషా లాంటి హీరోయిన్ల బాలయ్య స్థాయికి తక్కువగానే అనిపించారు. ఇప్పుడు 'రూలర్'లో సోనాలి చౌహాన్, వేదికల పరిస్థితి కూడా అంతే. బాలయ్య తర్వాతి సినిమాకు కూడా ఇలాంటి హీరోయిన్లే దిక్కు అనుకుంటుంటే.. బోయపాటి మాత్రం భిన్నంగా ఆలోచించాడు. బోయపాటి సినిమాల్లో భారీతనం గురించి కొత్తగా చెప్పేదేముంది? అందుకే హీరోయిన్ల విషయంలో అతను రిచ్‌గా ఆలోచిస్తున్నాడు.

నందమూరి హీరోకు జోడీగా 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్‌ను తీసుకోవాలన్నది ఆయన ప్లాన్. కీర్తిని ఇప్పటికే సంప్రదించినట్లు కూడా వార్తలొస్తున్నాయి. మరి బాలయ్య సరసన నటించే సాహసం కీర్తి చేస్తుందా అన్నదే డౌట్. పవన్ కళ్యాణ్ మినహాయిస్తే తెలుగులో ఏ స్టార్ హీరో పక్కనా కీర్తి అవకాశం అందుకోలేకపోయింది. 'మహానటి' తర్వాత ఆమె వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుండటం కూడా ఆమెకు వేరే స్టార్ల పక్కన ఛాన్స్ రాకపోవడానికి కారణం. ఇలాంటి సమయంలో బాలయ్యతో చేస్తే యంగ్ స్టార్ల పక్కన ఛాన్సులు రావడం కష్టమే. మరి కీర్తి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English