దిల్ రాజు సినిమా.. టర్కీ నుంచి పట్టుకొచ్చారు

దిల్ రాజు సినిమా.. టర్కీ నుంచి పట్టుకొచ్చారు

యువ కథానాయకుడు రాజ్ తరుణ్‌తో దిల్ రాజు ఇంతకుముందు నిర్మించిన ‘లవర్’ సినిమా ఆయనకు చేదు అనుభవమే మిగిల్చింది. రాజ్ మార్కెట్ చూసుకోకుండా అయినకాడికి ఖర్చు పెట్టేయడం.. సినిమాకు అనుకున్నంతగా బిజినెస్ జరగకపోవడం.. పైగా బ్యాడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమాకు కనీస వసూళ్లు కూడా రాకపోవడంతో దిల్ రాజు బాగా నష్టపోయాడు.

అయినా సరే.. రాజ్‌తో ఇంకో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు రాజు. ఆ సినిమానే.. ఇద్దరి లోకం ఒకటే. ‘లవర్’ తర్వాత రాజ్ మార్కెట్ మరింతగా దెబ్బ తినేసినప్పటికీ.. రాజు అతడితో ఇంకో సినిమా చేయడం విశేషమే. ఐతే రాజుకు తెలియకుండా ఈ కథ విన్న రాజ్.. ఆయన ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడని తెలిసి తనే స్వయంగా ఇందులో హీరోగా చేస్తానని అడిగాడట.ఐతే ఇది ఒరిజినల్ స్టోరీ ఏమీ కాదట. ఓ టర్కీ సినిమా స్ఫూర్తితో తెరకెక్కిందని రాజు వెల్లడించాడు.

ఇప్పటి వరకు ‘ఇద్దరి లోకం ఒకటే’ కథ గురించి ఎవరికీ ఏ ఐడియా లేదు. ఐతే ఓ టర్కీ సినిమా ఐడియా నచ్చి దాన్ని తెలుగులోకి తీసుకొచ్చినట్లు రాజే స్వయంగా వెల్లడించాడు. ఈ చిత్ర దర్శకుడు జీఆర్ కృష్ణ ఓ టర్కీ సినిమా చూసి ఆ ఐడియా తనకు చెప్పాడని.. అది నచ్చి మన నేటివిటీకి తగ్గట్లుగా కథను మార్చి డెవలప్ చేశామని.. ఒక చక్కటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇది తెరకెక్కిందని రాజు తెలిపాడు.

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన హీరో, హీరోయిన్‌  మధ్య  ఇంటిమసీ ఎలా పెరిగింది? ఇద్దరూ అనుకోకుండా విడిపోయి.. ఎలా కలిశారు? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేదే ఈ సినిమా  కథ అని రాజు చెప్పాడు. ఈ సినిమా కథ తెలుసుకున్న రాజ్‌తరుణ్‌ తనను వచ్చి కలిసి ‘సార్‌! కథ బావుందని విన్నాను. నేను చేస్తానండి’ అన్నాడని.. అలా ఈ సినిమా మొదలైందని.. తమ బేనర్‌కు ఈ ఏడాది ‘ఎఫ్-2’, ‘మహర్షి’ల తర్వాత హ్యాట్రిక్ హిట్ ఇచ్చే సినిమా ఇదని రాజు ధీమా వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English