రామజోగయ్య కోసం సీతారామశాస్త్రి చేసిన త్యాగం

రామజోగయ్య కోసం సీతారామశాస్త్రి చేసిన త్యాగం

దిగ్గజ గేయ రచయిత సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేయడానికి కూడా ఒక అర్హత, స్థాయి ఉండాలంటారు సినీ జనాలు. ఆ అవకాశం దక్కించుకుని.. ఆయన దగ్గర ఏడాదికి పైగా పని చేసి.. ఆ తర్వాత గేయ రచయితగా అవకాశాలు అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకుని.. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు రామజోగయ్య శాస్త్రి. ఐతే ఈయనకు సినిమాల్లో బ్రేక్ ఇప్పించింది కూడా సీతారామశాస్త్రేనట. తాను రాయాల్సిన పాటను ఈయనకు త్యాగం చేయడమే కాదు.. ఈయన కోసం సీతారామశాస్త్రి ఒక పాట కూడా రాసి ఇచ్చారట. ఆయన వల్ల తానీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటూ చాలా ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు రామజోగయ్య ఓ టీవీ కార్యక్రమంలో.

తెలుగువాడైన రామజోగయ్య ఇంజినీరింగ్ వృత్తి రీత్యా బెంగళూరులో ఉంటూ కన్నడ నేర్చుకుని, ఆ భాషలో పాటలు రాయడం విశేషం. ఆ క్రమంలో 'ఏకాంగి' అనే సినిమాకు డబ్బింగ్ పాటలు రాయడం కోసం కృష్ణవంశీ.. రామజోగయ్యను సీతారామశాస్త్రి దగ్గరకు తీసుకెళ్లారట. అప్పుడు 'మీ దగ్గర శిష్యరికం చేయొచ్చా' అని రామజోగయ్య సిరివెన్నెల వారిని అడిగారట. ఆయన సరే అనడంతో ఏడాదికి పైగా ప్రయాణం చేశానని.. ఆ సమయంలోనే స్రవంతి రవికిషోర్ తనకు 'యువసేన'లో ఛాన్స్ ఇచ్చారని రామజోగయ్య గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో ముందు తనను ఐటెం సాంగ్ రాయమన్నారని.. డ్యూయెట్ సీతారామశాస్త్రి రాయాల్సిందని.. కానీ ఐటెం పాట మాత్రమే రాస్తే తర్వాత అన్నీ అలాంటి పాటలే వస్తాయని చెప్పి.. ఆయన రాయాల్సిన డ్యూయెట్‌ కూడా తనకే ఇప్పించారని.. అంతే కాక 'ఓణీ వేసుకున్న పూల తీగ..' పాటకు పల్లవి ఆయనే రాసిచ్చి.. తాను రాసిన వాటిలోని పదాలతోనే చరణం పూర్తి చేశారని.. ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని.. ఆ సినిమాలో పాటలకు మంచి పేరొచ్చి తాను నిలదొక్కుకున్నానని.. ఆ తర్వాత 'ఖలేజా'లో కూడా సీతారామశాస్త్రి రాయాల్సిన పాటనే తనకిస్తే 'సదాశివా సన్యాసి' రాశానని చెప్పాడు రామజోగయ్య.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English