విజయ్ దేవరకొండ.. మళ్లీ అదే రిస్క్

విజయ్ దేవరకొండ.. మళ్లీ అదే రిస్క్

పాన్ ఇండియా.. ఇంతకుముందు ఈ పదం చాలా కొత్తగా అనిపించేది. కానీ ఈ మధ్య సామాన్య ప్రేక్షకులు కూడా అలవోకగా ఈ మాట వాడేస్తున్నారు. ఏదో ఒక భాషకు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజయ్యే చిత్రాల్ని పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు. 'బాహుబలి' దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాక రీజనల్ సినిమాల నుంచి ఇలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయి.

 కానీ అందులో మంచి ఫలితాలందుకున్న సినిమాలు చాలా తక్కువ. తెలుగు నుంచి 'బాహుబలి' తర్వాత మరే సినిమా కూడా పాన్ ఇండియాలో సత్తా చాటలేదు. 'సాహో', 'సైరా' లాంటి భారీ చిత్రాలు కూడా నిరాశ పరిచాయి. 'సాహో' హిందీలో బాగా ఆడి తెలుగు రాష్ట్రాలు సహా మిగతా చోట్లంతా డిజాస్టర్ అయింది. 'సైరా' తెలుగు వరకే బాగా ఆడి.. మిగతా చోట్ల తేలిపోయింది.

ఇక విజయ్ దేవరకొండ సినిమా 'డియర్ కామ్రేడ్' సౌత్ అంతటా పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేశారు. నాలుగు భాషల్లో వేర్వేరుగా ఒకేసారి ఈ చిత్రం రిలీజైంది. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అన్ని చోట్లా డిజాస్టరే అనిపించుకుంది. అంతకుముందు 'నోటా'ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. అది కూడా తుస్సుమంది.

సౌత్ ఇండియా అంతటా ఫాలోయింగ్ పెంచుకుందామని, మార్కెట్ విస్తరిద్దామని చూస్తే.. ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది. తెలుగులోనే అతడి మార్కెట్ దెబ్బ తినేసి.. 'వరల్డ్ ఫేమస్ లవర్'కు ఇక్కడే అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగని పరిస్థితి తలెత్తింది. అలాంటిది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించబోయే 'ఫైటర్' సినిమాకు పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్‌లో ఉన్నాడట విజయ్ దేవరకొండ.

దక్షిణాదిలోని మిగతా భాషల్లోనే కాదు.. హిందీలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాడట. ఐతే తన బేస్ అయిన తెలుగు మార్కెట్టే దెబ్బ తింటున్న సమయంలో విజయ్ ఇంత రిస్క్ చేయడం అవసరమా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English