రాజమౌళి ఎప్పుడూ లేనిది ఇప్పుడిలా..

రాజమౌళి దేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదగడంలో అతడి కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. జక్కన్న కెరీర్లో ఒకటీ అరా మినహాయిస్తే అన్ని సినిమాలకూ కథ అందించింది ఆయన తండ్రి వియేంద్ర ప్రసాదే. ఆయన తన టీంతో కలిసి పకడ్బందీగా స్క్రిప్టు తయారు చేసి రాజమౌళి ముందే తేలిక చేసేస్తాడు. జక్కన్న కజిన్ అయిన ఎస్.ఎస్.కాంచి స్క్రిప్టు తయారీలో కీలకంగా వ్యవహరిస్తాడు. మేకింగ్ విషయంలో కీరవాణి భార్య శ్రీ వల్లి చాలా కీలకంగా ఉంటారు. అలాగే కొడుకు కార్తికేయ చాలా పనుల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంటాడు.

భార్య రమ కాస్ట్యూమ్స్ బాధ్యత తీసుకుంటుంది.  సంగీత పరంగా కీరవాణి అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన తమ్ముడు కళ్యాణి మాలిక్ తన వంతు సహకారం అందిస్తాడు. ఇలా కుటుంబం మొత్తం జక్కన్న వెనుక ఉండి నడిపిస్తుంటుంది. ఎవరి ప్రొడక్షన్లో సినిమా చేసినా.. ఇది మన సినిమా అన్నట్లు అందరూ కలిసి కట్టుగా కష్టపడి పని చేస్తారు. పారితోషకం కూడా అందరికీ కలిపి ఒక ప్యాకేజీలాగా తీసుకుంటారని అంటారు.ఐతే రాజమౌళికి ఆయన కుటుంబం ఇచ్చే సపోర్ట్ గురించి అందరికీ తెలిసిందే అయినా.. జక్కన్న దాని గురించి ఎక్కువగా మాట్లాడడు.

మన వాళ్ల గురించి మనం చెప్పుకోవడం ఏంటి అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రం ఆయన ఈ విషయంలో చొరవ తీసుకున్నాడు. ముంబయిలో నిర్వహించిన భారీ ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా.. ఈ సినిమాకే కాక తన చిత్రాలన్నింటికీ కుటుంబ సభ్యుల సహకారం ఏ స్థాయిలో ఉంటుందో గుర్తు చేసుకున్నాడు. ‘‘నా సినిమాలకు మా కాంచి అన్న ఇచ్చే సపోర్ట్ గురించి ఎంత చెప్నినా తక్కువే. ఆయన్ని స్క్రిప్ట్ డాక్టర్ అని, వాచ్ డాగ్ అని అంటుంటాం. నేను ఎక్కడ చిన్న తప్పు చేసినా, పక్కదారి పట్టినా ఆయన సరి చేస్తాడు. స్క్రిప్టు, అలాగే మేకింగ్ విషయంలో ఆయన ఇచ్చే ఇన్ పుట్స్ చాలా కీలకమైనవి. ఈ సినిమా విషయంలోనూ ఆయన గొప్ప సహకారాన్ని అందించారు. అలాగే మా పెద్దన్న (కీరవాణి) సంగీత పరంగానే కాదు.. నా సినిమాల మేకింగ్ విషయంలోనూ కీలకంగా ఉంటారు. ఆయన రష్ చూసి ఓకే చెబితేనే ముందుకు వెళ్తాం. ఆయన సినిమా చూస్తుంటే మేం చాలా టెన్షన్ పడతాం.

ఏ చెబుతారా అని. ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ వెర్షన్ చూసినపుడు ‘బాహుబలి’ కంటే బాగుందని ప్రశంసించారు. ఇక మా వదిన శ్రీ వల్లికి నేను ఎప్పుడూ కష్టమైన బాధ్యతలే అప్పగిస్తారు. ‘బాహుబలి’కి ఆమె ఐదేళ్ల పాటు ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. అందులో అనుభవం సంపాదించాక ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చేసరికి పోస్ట్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ బాధ్యతలిచ్చారు. ఆ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారు. ఇక మా అబ్బాయి కార్తికేయ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేశాడు. మామూలుగా నన్ను మించి కష్టపడే మనిషి లేరనే ఒక అహంభావం నాకుంది. కానీ వాడు నన్ను మించి కష్టపడి ఆ అభిప్రాయాన్ని మార్చేశాడు. కొన్ని విషయాల్లో నేనైనా రాజీ పడతాను కానీ.. వాడు మాత్రం వదిలిపెట్టడు’’ అంటూ తన ఫ్యామిలీ మెంబర్స్‌కు ఎన్నడూ లేనంత ఎలివేషన్ ఇచ్చాడు జక్కన్న.