కొడుకు భారం దిగిపోయింది.. ఆ హీరో ఎమోషనల్

 కొడుకు భారం దిగిపోయింది.. ఆ హీరో ఎమోషనల్

తాము ఎన్ని కష్టాలు పడ్డా తమ పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. వాళ్లకు ఏ ఇబ్బందులూ రాకుండా అన్నీ సమకూర్చి పెడతారు. సినీ రంగంలో అవస్థలు పడి నిలదొక్కుకున్న హీరోలు తమ పిల్లల అరంగేట్రం మాత్రం సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లూ చేసి పెడతారు. చిన్న చిన్న పాత్రలెన్నో చేసి.. ఇండస్ట్రీలోకి వచ్చిన దశాబ్దానికి కానీ నిలదొక్కుకోని విక్రమ్ సైతం తన కొడుకు ధ్రువ్ కోసం పర్ఫెక్ట్ లాంచ్ సెట్ చేశానని అనుకున్నాడు.

తెలుగులో సెన్సేషనల్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’ని రీమేక్ చేయడం ద్వారా ధ్రువ్‌కు రెడీమేడ్ హిట్ ఇచ్చేయాలనుకున్నాడు. కానీ అతనొకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచాడు అన్నట్లుగా.. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌కు ఎక్కడ లేని నెగెటివిటీ వచ్చి.. ఒకసారి తీసిన సినిమాను చెత్తబుట్టలో పడేయాల్సిన పరిస్థితి వచ్చింది.

రెండోసారి తీసిన సినిమా విషయంలో కూడా సానుకూల స్పందన రాలేదు. నెగెటివిటీ కొనసాగింది. పలుమార్లు వాయిదా వేసి చివరికి గత శుక్రవారం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ సినిమా ఆడుతుందన్న నమ్మకాలు ఎవరికీ పెద్దగా లేవు. కానీ ఇంత నెగెటివిటీని తట్టుకుని ‘ఆదిత్య వర్మ’ బాగానే ఆడుతోంది. ధ్రువ్‌ నటన గురించి అందరూ పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు.

విజయ్ దేవరకొండతో పోలిస్తే వేరు కానీ.. ధ్రువ్ పెర్ఫామెన్స్ ఓకే అనే అంటున్నారు. సినిమా హిట్ దిశగా అడుగులేస్తోంది. దీంతో విక్రమ్ ఆనందానికి అవధుల్లేవు. దాదాపు రెండేళ్లుగా అతడి కుటుంబం ధ్రువ్ తొలి సినిమా విషయంలో టెన్షన్ పడుతోంది. ఆ టెన్షన్ అంతకంతకూ పెరిగి విడుదల ముంగిట తార స్థాయికి చేరింది.

ఐతే సినిమాకు అంతిమంగా పాజిటివ్ రిజల్టే రావడంతో విక్రమ్ అమితానందంతో మీడియాను కలిశాడు. ఒక రివ్యూలో ‘విక్రమ్ కొడుకు ధ్రువ్’ అని కాకుండా.. ‘ధ్రువ్ తండ్రి విక్రమ్’ అని రాశారని.. అంతకంటే తనకు ఆనందం కలిగించే విషయం మరొకటి లేదని.. ఇలాంటి సినిమాతో తన కొడుకు హీరోగా పరిచయం అయ్యేందుకు మూల కారకుడైన సందీప్ రెడ్డి వంగాకు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నానని చాలా ఎమోషనల్‌గా చెప్పాడు విక్రమ్. ఆయన తీరు చూస్తే నెత్తిన మోస్తున్న పెద్ద భారం దిగిపోయిన ఫీలింగ్ కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English