నస పెడుతున్న నాగబాబు

నస పెడుతున్న నాగబాబు

'జబర్దస్త్' షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొన్ని రోజుల పాటు అనేక ఊహాగానాలు నడవగా.. స్వయంగా నాగబాబే తన యూట్యూబ్ ఛానెల్లో ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. మూడు రోజుల కిందట ఒక వీడియో ద్వారా.. తాను జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్న మాట వాస్తవమే అని నాగబాబు ధ్రువీకరించాడు. కొన్ని సైద్ధాంతిక పరమైన విభేదాల కారణంగా తాను ఈ షో నుంచి బయటికి వచ్చానన్నాడు.

'జబర్దస్త్'తో తనకున్న బాండింగ్ గురించి.. ఈ షో ద్వారా తనకు కలిగిన ప్రయోజనం గురించి ఆయన కొంచెం ఎమోషనల్‌గానే మాట్లాడాడు. ఐతే తాను షో నుంచి బయటికి రావడాానికి నిర్దిష్టమైన కారణాలు నాగబాబు చెప్పలేదు. దీని గురించి తర్వాత వివరిస్తా అన్నాడు.

ఇలా చెప్పి తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశాడు నాగబాబు. అది దాదాపు పది నిమిషాల నిడివి ఉంది. తన ఎగ్జిట్ వెనుక అసలు కారణాలేంటో నాగబాబు ఈ వీడియోలో చెబుతాడేమో అని జనాలు ఆసక్తిగా చూస్తే.. అందులో ఆ విషయమే లేదు. తన జబ్దర్దస్త్ ప్రయాణం ఎలా మొదలైందో.. నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చాడు. ముందు 'జబర్దస్త్'ను 25 ఎపిసోడ్లు మాత్రమే నడిపించనున్నట్లు చెప్పి తనను తీసుకున్నారన్నాడు. షో మొదలయ్యాక ఎలా ఆదరణ పొందింది.. అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేసింది.. వాళ్లు ఎలా ప్రతిభ చాటుకుంది.. ఎలా ఎదిగింది.. వివిధ టీంల నుంచి కొత్త లీడర్లు ఎలా వచ్చింది తాపీగా చెప్పుకుంటూ వచ్చాడు నాగబాబు.

జనాలకు ఇవన్నీ ఏమంత ఆసక్తి కలిగిస్తాయన్నది ఆలోచించకుండా అవసరం లేని వివరణ ఇస్తూ వెళ్లాడు. మొత్తం వీడియో అయ్యాక కూడా అసలు విషయంలోకి రాలేదు. తన ఎగ్జిట్‌లో కీలంగా ఉన్న జబర్దస్త్ డైరెక్టర్లు నితిన్, భరత్‌ల అరంగేట్రం గురించి మాత్రమే చెప్పిన నాగబాబు.. మిగతా వివరాలు తరువాయి భాగంలో అన్నాడు. ఆ భాగానికి సంబంధించిన ప్రోమోలో ఏమో.. రచ్చరవి యాక్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు.

చూస్తుంటే దీన్ని ఒక సీరియల్ లాగా ఒక పది ఎపిసోడ్లు నడిపించేలా ఉన్నాడు నాగబాబు. అంతా అయ్యాక కానీ అసలు విషయం చెప్పేలా లేడు. జనాలకు ఆసక్తి రేకెత్తిస్తున్నది.. నాగబాబు ఎగ్జిట్‌కు కారణమేంటన్నదే. కానీ ఆయన తన జబర్దస్త్ ప్రయాణం మొత్తం చెప్పుకుంటూ జనాలకు నస పెట్టేస్తున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English