ఉపాధ్యాయులకు జనసేన మద్దతా ?

పీఆర్సీ సాధన సమితితో విభేదిస్తున్న ఉపాధ్యాయసంఘాలకు జనసేన మద్దతుగా నిలబడుతున్నదా ? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటన చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతబత్యాల వివాదాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదంటు మండిపడ్డారు. పీఆర్సీలో 27 శాతం ఫిట్మెంట్ సాధించటంలో పీఆర్సీ సాధన సమితి నేతలు ఫెయిలైనట్లు పవన్ ప్రకటించారు.

సమస్య పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవటమే కాకుండా ఉద్యోగసంఘాలపై ఆధిపత్య ధోరణి అవలంభించిందంటు దుయ్యబట్టారు. ఏ ప్రభుత్వమైనా తనదే పైచేయి కావాలని ప్రయత్నిస్తుంది. సమస్య ఏదైనా ఉద్యోగ సంఘాలు చెప్పినట్లు నడుచుకోవటానికి ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. చర్చల్లో అయినా ఇతరత్రా మార్గాల్లో అయినా అంతిమంగా తనదే పైచేయిగా ఉండాలని ప్రభుత్వం అనుకోవటంలో తప్పేమీ లేదు.  నిర్ణయాలు సరిగ్గా ఉన్నపుడు అది నడుస్తుంది గాని… అహంకారంతో నిర్ణయాలు చేసినపుడు కూడా తమదే నెగ్గాలని ప్రభుత్వం అనుకుంటే అది జరిగే పని కాదు.

చర్చలకు వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలను ఒత్తిడిలోకి నెట్టేసి ధన్యవాదాలు చెప్పేట్లుగా ప్రభుత్వం ఉద్యోగుల నేతలను కార్నర్ చేయటం ఏమిటంటు పవన్ ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలతో విభేదిస్తున్న ఉపాధ్యాయ సంఘాల వ్యాఖ్యలను పవన్ ప్రస్తావించటం గమనార్హం. ఈ నేపధ్యంలోనే జనసేన ఉపాధ్యాయసంఘాల డిమాండ్లకు మద్దతుగా నిలబడుతోందన్నట్లుగా చెప్పారు.

రెండు రోజుల క్రితం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు పిలిచినా ఆందోళనల్లో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉంటామని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జరుగుతున్నది చూస్తుంటే ఇపుడు ఉపాధ్యయుల సంఘాల ఆందోళనలకు డైరెక్టుగానే జనసేన మద్దతు ప్రకటించింది. బహుశా పవన్ ప్రకటన చూసిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు ఉద్యోగులు చేసే ఆందోళనల్లో జనసేన కార్యకర్తలు కూడా పాల్గొంటారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ విషయంలో పవనే క్లారిటీ ఇవ్వాలి.