ఎన్టీఆర్ ఫ్యాన్స్.. లైట్ తీస్కోండి బాస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్.. లైట్ తీస్కోండి బాస్

మొత్తానికి ఐదారు నెల‌ల స‌స్పెన్సుకు తెర‌ప‌డింది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న‌ ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక ఎవ‌రో తెలిపోయింది. బ్రిట‌న్‌కు చెందిన థియేట‌ర్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్‌ను కొమ‌రం భీమ్ పాత్ర‌కు జోడీగా ఎంచుకున్నాడు జ‌క్క‌న్న‌. ఐతే ఈమె అంత పేరున్న న‌టి కాదంటూ తార‌క్ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ విష‌యంలో జూనియ‌ర్ అభిమానుల్ని గిచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఒలీవియాకు వికీపీడియా పేజీ కూడా లేక‌పోవ‌డం ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. చిన్నా చిత‌కా ఆర్టిస్టుల‌కు కూడా ఈ రోజుల్లో వికీలో చోటు ద‌క్కుతున్న నేప‌థ్యంలో ఇంత పెద్ద సినిమాలో న‌టించే హీరోయిన్‌కు పేజీ లేక‌పోవ‌డం గురించి చిన్న డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. రామ్ చ‌ర‌ణ్‌కు మాత్రం ఆలియా భ‌ట్ లాంటి ఫేమ‌స్ హీరోయిన్ని పెట్టి.. తార‌క్‌కు జోడీగా ఇలాంటి అనామ‌కురాలిని పెడ‌తారా అంటూ అత‌డి ఫ్యాన్స్ చిన్న‌బుచ్చుకుంటున్నారు. ఐతే ఈ విష‌యంలో తార‌క్ ఫ్యాన్స్ నిజంగా ఫీల‌వ్వాల్సిందేమీ లేదు.

ఎన్టీఆర్ మీద రాజ‌మౌళి ప్రేమ ఎలాంటిదో తెలియంది కాదు. ఎవ‌రైనా తార‌క్ త‌ర్వాతే అంటాడాయ‌న‌. ఉద్దేశ‌పూర్వ‌కంగా అత‌డిని త‌గ్గించే ప్ర‌య‌త్నం ఎందుకు చేస్తాడు. పాత్ర‌కు త‌గ్గ‌ట్లు ఆర్టిస్టుల్ని తీసుకోవ‌డంలో రాజ‌మౌళి సిద్ధ‌హ‌స్తుడు. కాబ‌ట్టి ఒలీవియాను తీసుకోవ‌డానికి కార‌ణం లేకుండా పోదు. అయినా సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంది.. దాన్ని జ‌క్క‌న్న ఎలివేట్ చేశాడు అన్న‌దే చూడాలి త‌ప్ప‌.. అత‌డి ప‌క్క‌న ఎవ‌రు న‌టిస్తే ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English