చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా?

రజనీకాంత్, కమల్ హాసన్.. తమిళ సినీ పరిశ్రమకు రెండు కళ్లు. ఇద్దరికీ దిగ్గజ స్థాయి ఉంది. ఇద్దరినీ వారి అభిమానులు దేవుళ్లలా చూస్తారు. ప్రజాదరణలో ఎవరికి వారే సాటి. వీళ్లిద్దరూ రాజకీయాల్లోకి రావాలని జనాలు ఎంతగానో కోరుకున్నారు. కానీ ఆ దిశగా చాలా కాలం అడుగులు వేయకుండా ఆగిపోయారు. ఐతే జయలలిత మరణం తర్వాత ఇద్దరికీ రాజకీయాలపై మనసు మళ్లింది.

అటు కరుణానిధి కూడా కాలం చేయడంతో తమిళనాట ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఇద్దరూ తయారైపోయారు. ఒకరి తర్వాత ఒకరు రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించారు. కమల్ ఆల్రెడీ పార్టీ పెట్టాడు. రజనీ కూడా త్వరలోనే పార్టీని ఆరంభించబోతున్నారు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులు కావడం, ఇద్దరికీ భారీగా అభిమానగణం ఉండటంతో రాజకీయాల్లోనూ చేతులు కలిపితే మంచి ఫలితం ఉంటుందని.. అధికారం వాళ్లను దాటి వెళ్లదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఐతే కలిసి ఒకే పార్టీ పెట్టడమో.. లేదంటే వేర్వేరుగా పెట్టినా ముందే ఒక ఒప్పందానికి రావడమో చేస్తే బాగుండేది. ముందే కలిసి జనాల్లో తిరిగితే మంచి ఫలితం ఉండేది. కానీ కమల్ పార్టీ పెట్టి పార్ట్ టైం రాజకీయాలు చేశాడు. రజనీ అసలు పార్టీ పెట్టడంలోనే చాలా ఆలస్యం చేశాడు. లోక్ సభ ఎన్నికల్లో కమల్ పార్టీ నామమాత్రం అయింది. రజనీ అసలు ఎన్నికలకు దూరం అయిపోయాాడు. అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఇద్దరూ సరైన సన్నద్ధతతో లేరు. ఇద్దరూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఇద్దరూ రంగంలోకి దిగేలా ఉన్నారు. ఇంతకుముందు ఎవరికి వాళ్లు సీఎం అయిపోగలం అన్న ధీమాతో వేర్వేరు దారుల్లో వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు నమ్మకం సడలినట్లుంది. కలిసి పోటీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఆ దిశగా కమల్ సంకేతాలు కూడా ఇచ్చాడు.

ఐతే ఈ పని ఎప్పుడో చేయాల్సిందని.. ఇద్దరూ ఒక ప్రణాళిక ప్రకారం కలిసి పని చేస్తే పరిస్థితి వేరుగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాలు నెమ్మదిగా వీళ్లపై నమ్మకం కోల్పోతున్న దశలో.. ఎన్నికల దిశగా అసలు కసరత్తే చేయని సమయంలో ఇప్పుడు కమల్ కలిసి పోటీ చేసే విషయమై ప్రకటన చేయడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి వచ్చే ఏడాది ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English