‘గీత గోవిందం’ వదులుకున్నా.. బాధ లేదు

‘గీత గోవిందం’ వదులుకున్నా.. బాధ లేదు

తాము వదులుకున్న సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. ఏ ఆర్టిస్టు అయినా చింతించకుండా ఉండరు. ఇంత పెద్ద హిట్‌ను మిస్ చేసుకున్నామే అనే బాధ వెంటాడుతుంది. అందులోనూ ఆ సినిమా చేస్తే కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉన్నపుడు.. ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. ఐతే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తనకు అలాంటి ఫీలింగ్ లేదంటోంది. గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘గీత గోవిందం’ సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటించాల్సింది.

విజయ్‌కి జోడీగా రకుల్‌నే ముందు హీరోయిన్‌గా అనుకున్నాడట దర్శకుడు పరశురామ్. ఐతే రకుల్‌ను సంప్రదిస్తే అప్పటికే ‘దే దే ప్యార్ దే’ కోసం డేట్లు ఇచ్చి ఉండటంతో ఈ సినిమా చేయలేను అనేసిందట. దీంతో కన్నడ అమ్మాయి రష్మిక మందన్నాను ఎంచుకున్నారు. ఈ సినిమాతో ఆమెకు ఎంత మంచి పేరొచ్చిందో.. సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.

మీ కెరీర్లో ఏదైనా సినిమాను మిస్సయ్యారా అని ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ను అడిగితే.. తనే స్వయంగా ‘గీత గోవిందం’ గురించి చెప్పింది. ‘దే దే ప్యార్ దే’ కోసమే ఆ సినిమాను వదులుకున్నట్లు చెప్పింది. కానీ ‘గీత గోవిందం’ వదిలేశామే అని తానేమీ చింతిస్తూ కూర్చోలేదని చెప్పింది రకుల్. కానీ ఆ సినిమా పెద్ద హిట్టవడంతో ఇందులో నటించి ఉంటే బాగుండేదే అని మాత్రం చాలాసార్లు అనుకున్నట్లు రకుల్ వెల్లడించింది.

‘గీత గోవిందం’ చేయడానికి ముందు విజయ్ దేవరకొండ ఓ మోస్తరు హీరోనే. అప్పటికే ‘అర్జున్ రెడ్డి’తో మంచి పేరు సంపాదించినప్పటికీ.. అతణ్ని పెద్ద స్టార్‌గా మార్చింది మాత్రం ‘గీత గోవిందం’ మూవీనే. అప్పటికే తెలుగులో పెద్ద పెద్ద స్టార్లతో చేసిన రకుల్.. విజయ్ సరసన ఏం చేస్తాం అని అనుకుందేమో. ఆ సినిమా చేస్తే తెలుగులో రకుల్ కెరీర్ మరో రకంగా ఉండేదేమో. ఇప్పుడు టాలీవుడ్లో ఆమె అడ్రస్ దాదాపు గల్లంతయిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English