ఎన్టీఆర్ సినిమాపై సురేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ సినిమాపై సురేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తొలి సినిమా 'అతనొక్కడే'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అప్పటికి కళ్యాణ్ రామ్‌ను చిన్న స్థాయి హీరోగా కూడా గుర్తించలేదు ఎవరూ. అతడి తొలి రెండు సినిమాలు డిజాస్టర్లే. కళ్యాణ్‌ను ఎవరూ పట్టించుకోని సమయంలో అతడితో 'అతనొక్కడే' లాంటి మాస్ సినిమా చేసి సెన్సేషనల్ హిట్ అందించాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందతడికి. వీళ్లిద్దరి కాంబినేషన్లో 'అశోక్' అంచనాల్ని అందుకోలేకపోయింది. ఐతే ఈ సినిమా సురేందర్ ఇష్టపడి చేసింది కాదట. అతడితో బలవంతంగా ఈ సినిమా చేయించారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయమై సురేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

'అతనొక్కడే' తర్వాత సురేందర్.. ప్రభాస్‌తో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడట. ఈ సినిమాకు సన్నాహాలు జరుగుతుండగా.. అప్పటి ఎన్టీఆర్ మేనేజర్ తనను తీసుకెళ్లాడని.. రెండు మూడు రోజుల పాటు తన వెంటపడి ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ఒప్పించాడని సురేందర్ చెప్పాడు. తాను ఏ విషయం చెప్పకుండానే సినిమా ఎలా చేద్దాం.. ఎక్కడ చేద్దాం అన్నట్లుగా మాట్లాడాడని.. తనకు అది ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ.. ఎన్టీఆర్ పెద్ద హీరో కదా చేయనంటే ఏమవుతుందో అని అయిష్టంగానే ఆ సినిమా ఒప్పుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు సురేందర్.

అప్పుడు 'అశోక్' కథ తన చేతుల్లో పెట్టారని.. ఐతే తాను ప్రభాస్ కోసం అనుకున్న కథ ఇంకో రకమైందని.. 'అశోక్' కథ చూస్తే ఇది తన తరహా కథ కాదు కదా అనిపించిందని.. దీంతో విముఖంగానే ఈ సినిమా చేయాల్సి వచ్చిందన్నట్లుగా సురేందర్ వ్యాఖ్యానించాడు. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లకు సురేందర్ ఇలా మాట్లాడటంతో ఎన్టీఆర్ అతడిని బలవంతంగా సినిమాకు ఒప్పించాడా అన్న చర్చ జరుగుతోంది. ఐతే వీళ్లిద్దరి కాంబినేషన్లో ఆ తర్వాత 'ఊసరవెల్లి' సినిమా కూడా వచ్చిన సంగతి గమనార్హం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English