చిరు కడుపులో ఉండగా ఏఎన్నార్ సినిమా రిలీజైతే..

చిరు కడుపులో ఉండగా ఏఎన్నార్ సినిమా రిలీజైతే..

మెగాస్టార్ చిరంజీవికి దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంత అభిమానమో గతంలో ఎన్నోసార్లు బయటపెట్టాడు. ఏఎన్నార్‌ గురించి ఎప్పుడు మాట్లాడినా.. ఆయన జీవించి ఉండగా ఎప్పుడు కలిసినా చిరులో ఎంతో ఎగ్జైట్మెంట్ కనిపించేది. ఏఎన్నార్‌తో కలిసి నటించిన మెకానిక్ అల్లుడు'ను తన కెరీర్లో మరపురాని జ్ఞాపకంగా చెప్పుకునేవాడు చిరు. ఇప్పుడు ఏఎన్నార్ జాతీయ అవార్డుల వేడుకలో భాగంగా తన తల్లికి ఏఎన్నార్ అంటే ఎంతిష్టమో చెబుతూ.. తాను ఆమె కడుపులో ఉండగా జరిగిన ఓ ఆసక్తికర ఉదంతం గురించి వెల్లడించాడు చిరు. ఈ వేడుకలో ఆ ఉదంతం గురించి చిరు ఏం చెప్పాడన్నది ఆయన మాటల్లోనే..

''ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఓ సంఘటనను మీకు చెబుతా. అది ఓ పల్లెటూరు. అప్పుడే కొత్తగా పెళ్లైన జంట. ఆమె గర్భవతి, నవమాసాలు నిండాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత థియేటర్‌ వెళ్లి సినిమా చూసే అవకాశం ఉండదు. అదే సమయంలో తన అభిమాన నటుడి సినిమా విడుదలైంది. ఈ కోరికను తన భర్తకు చెప్పింది. ఈ సమయంలో ఎలా వెళ్తామని ఆయన అడిగాడు. సరే.. తప్పక భార్య కోరికని ఒప్పుకొన్నాడు. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల పక్కన ఉన్న టౌన్‌కు వెళ్లాలి. అప్పుడు ఈ సౌకర్యాలు లేవు. అలానే గతుకుల రోడ్డు మీద బయలుదేరారు. గుర్రంపైన వెళ్తుంటే మార్గ మధ్యంలో ప్రమాదం జరిగింది, ఇద్దరు కిందపడ్డారు. భర్త భయపడిపోయాడు. పైకిలేచి భార్య పరిస్థితి చూశాడు.

అదృష్టవశాత్తూ ఏమీ కాలేదు. సరే తిరిగి ఇంటికి వెళ్లిపోదాం అని భర్త అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. ఎలాగో థియేటర్‌కు వెళ్లారు. అభిమాన హీరో సినిమాను ఆమె ఎంతో సంతోషంగా చూసింది. ఇంటికి వచ్చేశారు. ఈ కథలో ఆ గర్భిణి స్త్రీ మా అమ్మ అంజనా దేవి. ఆ భర్త మా నాన్న వెంకటరావుగారు. ఆ పల్లెటూరు మొగల్తూరు. పక్కన ఉన్న టౌన్‌ నరసాపురం. అది 1955 సంవత్సరం. ఆ సినిమా 'రోజులు మారాయి'. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు గారు" అంటూ ఏఎన్నార్ ‌మీద తమ కుటుంబానికున్న అభిమానం గురించి ఎంతో హృద్యంగా చెప్పుకొచ్చాడు చిరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English