మూవీ రివ్యూ : ఆహా కళ్యాణం

మూవీ రివ్యూ : ఆహా కళ్యాణం

అరవ మేళం!
తమిళవారికి అంతగా తెలియని నానిని హీరోగా పెట్టి తమిళంలో సినిమా తీసి తెలుగులోకి అనువదించడం ఏమిటని 'ఆహా కళ్యాణం' చూసిన వారికి అనిపిస్తుంది. ఎంచక్కా నానితో తెలుగులోనే సినిమా తీసి, దానినే తమిళంలోకి అనువదించుకుని ఉండొచ్చు.. లేదా బుద్ధిగా రెండు భాషల్లోను విడివిడిగా తీసి లోకల్‌ ఫ్లేవర్‌ చెడిపోకుండా జాగ్రత్త పడుండొచ్చు. కానీ ఆహా కళ్యాణం సినిమాకి అన్నీ ఇలా అవక తవకగా ఎందుకు జరిగినట్టు? హిందీలో వచ్చిన 'బ్యాండ్‌ బాజా బారాత్‌' సినిమాని నందిని రెడ్డి దర్జాగా కాపీ కొట్టేసి 'జబర్దస్త్‌'గా రిలీజ్‌ చేసింది. అప్పటికే 'బాబాబా' రీమేక్‌ని మొదలుపెట్టిన యష్‌రాజ్‌ ఫిలింస్‌ ఇక తెలుగులో తీయడం ఖర్చు దండగ అనుకుని తమిళంలో మాత్రమే సినిమా నిర్మించి తెలుగులోకి డబ్‌ చేసేసింది. తమిళంలోనే సినిమా చేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు అదేదో తమిళ హీరోతోనే కానిచ్చి ఉంటే కనీసం అక్కడైనా ఈ సినిమాకి క్రేజ్‌ వచ్చి ఉండేది. కానీ నానికి ఇచ్చిన మాటకి కట్టుబడి తమిళంలో అతనితోనే తీసారు. కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్టు 'ఆహా కళ్యాణం' ఇలా అరవ మేళంలా మారడానికి కూడా తలో చెయ్యీ వేసారన్నమాట.

    హిందీలో వచ్చే కొన్ని రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ మన ఆడియన్స్‌ టేస్ట్‌కి, మన నేటివిటీకి సరిపడవు. 'బాబాబా' కూడా ఆ బాపతు సినిమానే. వెడ్డింగ్‌ ప్లానర్లు, హైఫై వెడ్డింగులు గట్రా ఇంకా మనకి అంతగా పరిచయం లేవు. ఇదంతా నార్త్‌లోను, సౌత్‌లో కొన్ని సంపన్న కుటుంబాలతోను పరిచయమున్న కల్చరు. కాబట్టి ఈ సినిమా నేపథ్యం మన ప్రేక్షకులకి అంతగా ఎక్కకపోవచ్చు. ఇంట్లో బాబాయ్‌లు, మేనమామలు కలిసి చేసేసే తంతుకి వేరే వాళ్లకి డబ్బులిచ్చి పెట్టుకోడం ఎందుకని అనుకుంటారు. అలాగే శారీరికరగా కలిసినా కానీ ఏమీ కానట్టు తిరిగేయడం కూడా మన కల్చరుకి సరిపడదు. నార్త్‌లో ఉన్న బ్రాడ్‌ మైండెడ్‌నెస్‌ ఇక్కడ లేదు. హీరోయిన్‌ని టామ్‌ బాయ్‌గా చూడ్డానికి మన ప్రేక్షకులు ఇంకా రెడీగా లేరు. అందుకే పూరి జగన్నాథ్‌ హీరోయిన్లు తరచుగా జనం చేత చీవాట్లు తింటూ ఉంటారు. బ్యాండ్‌ బాజా బారాత్‌ సినిమాలో అనుష్క శర్మ చేసిన క్యారెక్టర్‌ హీరోపై అజమాయిషీ చేస్తూ... డామినేట్‌ చేస్తుంటుంది. హిందీలో అప్పటికే అనుష్క శర్మ 'రబ్‌ నే బనాది జోడీ' సినిమాలో షారుక్‌ ఖాన్‌తో నటించేసి ఉంది. అందులో హీరోగా నటించిన రణ్‌వీర్‌ సింగ్‌ అస్సలు సినీ నేపథ్యమే లేని కొత్త కుర్రాడు. కాబట్టి అతనిపై హీరోయిన్‌ పెత్తనం చేస్తుంటే చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. ఆ పరంగా ఆలోచిస్తే ఈ చిత్రంలో నాని హీరోయిన్‌ అనుకున్నప్పుడు ఏ కాజల్‌లాంటి స్టార్‌ హీరోయిన్‌నో కథానాయికగా తీసుకోవాలి. అప్పుడు హీరోయిన్‌ క్యారెక్టర్‌ వెయిట్‌ పెరిగుండేది.

    చూడ్డానికి ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు. కానీ తెర మీదకి వచ్చేసరికి ఆ ఎఫెక్టే మారిపోతుంది. రీమేక్స్‌ చేసేప్పుడు ఒరిజినల్‌ ఎందుకు క్లిక్‌ అయిందనేది దర్శకులు స్టడీ చేయాలి. కథగా చెప్పుకుంటే చాలా సాదా సీదా కథ ఇది. వెడ్డింగ్‌ ప్లానర్స్‌గా రాణించిన జంట క్లాష్‌ వచ్చి విడిపోతుంది. చివరకు వారు ఎలా కలిసారన్నది ఈ సినిమా. చాలా రొటీన్‌గా అనిపించే కథే అయినా ఎందుకు అక్కడ బాగా ఆడిందంటే అది హీరో హీరోయిన్ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ. ఇక్కడ నాని, వాణి మధ్య అంతటి కెమిస్ట్రీ అయితే ఎక్కడా కనిపించదు. చివరకు లిప్‌ లాక్‌ సీన్‌లో కూడా వారిద్దరూ నటిస్తున్నట్టే ఉంటుంది తప్ప నిజమనిపించదు. కెమిస్ట్రీ కుదరనప్పుడు ఇక లవ్‌స్టోరీలు ఎలా పండుతాయి. అలాగే హీరోయిన్‌ వాణి కపూర్‌ది స్మయిలింగ్‌ ఫేస్‌. మామూలుగా ఉన్నా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. ఇందులో హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఎపుడూ చిరుబురులాడుతూ చిటపటలాడిపోతూ ఉండాలి. ఆ విధంగా కూడా వాణి కపూర్‌ ఈ సినిమాకి మైనస్‌ అయింది. మొదటి దక్షిణాది సినిమా అయినా కానీ బాగానే చేసింది కానీ మరీ ఈ క్యారెక్టర్‌ ఆమె నుంచి ఎక్కువ డిమాండ్‌ చేసేసింది.

    దర్శకుడు ఎదురుగా డివిడి పెట్టుకుని తీసినట్టు ఏమీ మార్చకుండా ఒరిజినల్‌కి కట్టుబడిపోయాడు. అయితే ఇలా కట్‌ పేస్ట్‌ వర్క్‌ చేసే టైమ్‌లో సీన్స్‌ యధావిధిగా తీసేస్తారు కానీ సినిమాలోని సోల్‌ని తిరిగి క్రియేట్‌ చేయడంలో విఫలమవుతారు. గోకుల్‌ కృష్ణ కూడా ఇక్కడే ఫెయిలయ్యాడు. సినిమాకి కీలకమైన ద్వితీయార్థంలో అతని కట్‌ పేస్ట్‌ వర్క్‌ ఉపయోగ పడలేదు. నాని ఎంత కష్టపడి ఈ సినిమాని లేపాలని చూసినా కానీ సన్నివేశాల్లోని డొల్లతనం డామినేట్‌ చేయడం వల్ల కళ్యాణం రక్తి కట్టలేదు. అంతా తమిళ తారాగణంతో నింపేసారు. కనీసం వారినైనా తెలిసిన ముఖాల్ని పెట్టి ఉంటే బాగుండేది. పూర్తిగా కొత్త స్టార్‌ కాస్ట్‌. దాంతో నానిపై అదనపు భారం పడింది. అయినా కానీ బాగానే కష్టపడ్డాడు. అతడి కష్టానికి తగ్గ ఫలితాన్నిచ్చే సినిమాలొస్తే బాగుంటుంది.

    సంగీత దర్శకుడు ఈ చిత్రానికి పెద్ద గుదిబండగా మారాడు. గట్టి మేళం అంటూ వారు నడిపే వెడ్డింగ్‌ ప్లానింగ్‌ కార్యాలయంలానే సంగీత దర్శకుడు కూడా గట్టి మేళం వాయించే వాయిద్య కారుడిలా పాటలు చేశాడు కానీ క్వాలిటీ లేదు. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ఒరిజినల్‌ని, జబర్దస్త్‌ని చూడని వాళ్లు ఓ మోస్తరు వినోదాన్ని పొందే వీలున్న ఈ చిత్రం తెలుగులో అయితే రాణించడం కష్టం. తమిళంలో నానిని చూడ్డానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారనే దానిపై యష్‌రాజ్‌ వారి పెట్టుబడికి గ్యారెంటీ ఆధారపడి ఉంటుంది.

రేటింగ్‌: 5.5/10

                                                                                                                   - వికటకవి

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English