స‌మోసాలో ఆలూ ఉంటుంది కానీ.. బీహార్‌లో లాలూ డౌటే

లాలూప్ర‌సాద్ యాదవ్…రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (ఆర్జేడీ) అధినేత‌, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి. దేశ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న నాయ‌కుడు. `స‌మోసాలో ఆలూ ఉన్నంత వ‌ర‌కు బీహార్‌లో లాలూ ఉంటాడు` అంటూ ఓ సంద‌ర్భంలో త‌న గురించి తాను లాలూ ప్ర‌క‌టించుకున్నాడు. అలాంటి ఇమేజ్ సైతం లాలూ క‌లిగి ఉన్నాడు. లాలూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా ఉన్న త‌రుణంలో ఆయ‌న‌కు తిరిగి అధికారం ద‌క్క‌డం క‌ష్టం అయిపోయింది. దీంతో బీహార్‌లో లాలూ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ ప‌రిస్థితి ఏంట‌నే చర్చ జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలోనే లాలూ పొలిటిక‌ల్‌ రిటైర్మెంట్ తెర‌మీద‌కు వ‌చ్చింది.

బీహార్ రాజ‌కీయాలు, దేశ రాజ‌కీయాల‌తో పాటు సంస్థాగ‌త వ్య‌వ‌హారాల చ‌ర్చించేందుకు ఫిబ్ర‌వ‌రి 10న రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది.  ఆర్జేడీలో అధికార మార్పిడి జ‌ర‌గ‌బోతోంద‌న్న చ‌ర్చ విప‌రీతంగా జ‌రుగుతోంది. ఆర్జేడీ అధ్యక్షుడిగా ప్ర‌స్తుతం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కొన‌సాగుతున్నారు. అయితే.. వ‌య‌స్సు రీత్యా, అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా పార్టీ ప‌గ్గాలు తేజ‌స్వీ యాద‌వ్‌కు అప్ప‌గించ‌డానికి రంగం సిద్ధ‌మైంద‌ని ఆర్జేడీలోని ఓ వ‌ర్గం విప‌రీతంగా ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించింది. అయితే, ఈ ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం బాగోలేద‌న్న‌ది నిజ‌మే అని అంగీక‌రించిన ఆర్జేడీలోనే మ‌రో వ‌ర్గం ఆయ‌న ఆరోగ్యంగా లేక‌పోయినా… రాజ‌కీయంగా మాత్రం అత్యంత చురుకుద‌నంతోనే ఉన్నార‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇప్ప‌టికీ వాహ‌నాల‌ను న‌డిపే స్థితిలో కూడా ఉన్నార‌ని, స‌భ‌ల‌ల్లో పాల్గొనే శ‌క్తి కూడా ఆయ‌న‌కు ఉందంటున్నారు.

అయితే, ఈ ప్ర‌చారంపై ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యులు సైతం ఘాటుగా స్పందించారు. ఆర్జేడీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తేజ‌స్వీ యాద‌వ్‌కు అప్ప‌గిస్తున్నార‌న్న వార్త‌ల‌న్నీ త‌ప్పుడు వార్త‌లేన‌ని ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తీవ్రంగా స్పందించారు.

కేవ‌లం మూర్ఖులు మాత్ర‌మే ఇలాంటి వార్త‌లు ప్రచారంలోకి తెస్తున్నార‌ని, అలాంటి అవ‌కాశాలేవీ లేవ‌ని లాలూ ప్రసాద్ ఢిల్లీ వేదిక‌గా స్ప‌ష్టం చేశారు. అయితే పార్టీ నిర్వ‌హ‌ణ‌తో పాటు ఇత‌ర అంశాల‌ను మాత్రం తేజ‌స్వీయే చూసుకుంటున్నార‌ని లాలూ స్ప‌ష్టం చేశారు. ఇక బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి, లాలూ భార్య ర‌బ్రీదేవి కూడా ఈ ఊహాగానాల‌పై స్పందించారు. అన్నీ త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం జ‌రుగుతున్నాయి. అంటూ ర‌బ్రీదేవి తీవ్రంగా మండిప‌డ్డారు. ఆర్జేడీ అధ్య‌క్షుడిగా లాలూ ఇప్పుడు ఉన్నార‌ని, ఇక‌ముందూ ఉంటారని ఇక లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్ర‌తాప్ స్పందించారు.