ఏపీ ఉద్యోగుల‌పై `ఎస్మా`.. కొర‌డా ఝ‌ళిపించేందుకు రెడీ!

ఉద్యోగుల సమ్మెపై ఎస్మా చట్టం ప్రయోగించే యోచనలో ప్రభుత్వం ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. ఎస్మా విషయమై సాధారణ పరిపాలన శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం ప్రకారం సమ్మె నిలువరించే ప్రయత్నాలు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా సూచించిన‌ట్టు స‌మాచారం. పౌర సేవలకు విఘాతం కలగకుండా ఎస్మా అమల్లోకి తేవాలని ఆయ‌న మౌఖిక ఆదేశాలు ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఉద్యోగుల కార్యాచరణ అనుసరించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్న‌ట్టు స‌మాచారం. సీఎంవోలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు చేసిన సీఎం.. ఈ మేర‌కు నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.

సీఎంతో భేటీ తర్వాత కార్యదర్శులు, కలెక్టర్లతో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఉద్యోగులు సమ్మెకు వెళితే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలపై ఆయ‌న‌ సమీక్షించారు. తుది ద‌శ‌గా.. శ‌నివారం కూడా ఉద్యోగ సంఘాలను పిలిచి మంత్రుల కమిటీ చర్చించాల‌ని నిర్ణ‌యించారు. హెచ్ఆర్ఏ, వేతన రికవరీ వంటి అంశాలపై మంత్రుల కమిటీ చర్చించే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఇది సాధ్యం కాక‌పోతే.. ఖ‌చ్చితంగా ఎస్మా దిశ‌గా అడుగులు వేసేందుకు ప్ర‌భుత్వం సూత్ర ప్రాయ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రోవైపు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ గ‌డిచిన రెండు గంట‌లుగా ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తున్నారు.  ఆదివారం అర్థరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ఈ కీలక సమావేశంలో చర్చిస్తున్నారు. ఉద్యోగుల పెన్ డౌన్, యాప్స్ డౌన్, ఉద్యోగ సంఘాల డిమాండ్ల అంశంపైనా మంత్రులతో చర్చిస్తున్నారు. పీఆర్సీ సహా హెచ్ఆర్ఎ, ఇతర డిమాండ్లపైనా డిస్కస్ చేస్తున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. పాలన స్తంభించకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం జగన్ సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎస్మా త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని.. నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు ఉద్యోగులు కూడా అంతే పంతంతో ఉన్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా తాము వెనుకాడేది లేదని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. మానవత దృక్పథంతో ప్రజలకు అత్యవసర సేవలకు అంతారయం కలగకుండా చూస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. శ‌నివారం నుంచి పెన్ డౌన్, ప్రభుత్వ మొబైల్ డౌన్ చేపడతామని తెలిపారు. ప్రభుత్వం వినియోగించే అన్ని మొబైల్ అప్లికేషన్లను అన్ ఇన్ స్టాల్ చేయాలని పీఆర్సీ సాధన సమితి నేత ఆస్కార్ రావు  తెలిపారు.