జ‌గ‌న్‌కు సెల్ఫ్‌గోల్‌.. బాబుకు లాభం!

టీడీపీకి రాజ‌కీయ మ‌నుగ‌డ ఉండాలంటే ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం అనివార్యం. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో ఘోర ప‌రాజ‌యం చెందిన ఆ పార్టీ రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డింది. ఆ త‌ర్వాత కూడా రాష్ట్రంలో జ‌రిగిన వివిధ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మిపాలైంది. దీంతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టారు. ఆ ఎన్నిక‌ల్లో కానీ గెల‌వ‌క‌పోతే త‌న రాజ‌కీయ జీవితం ముగిసిన‌ట్లేన‌ని బాబుకు బాగా తెలుసు. అందుకే 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇలాంటి స‌మ‌యంలో ఉద్యోగుల ఆందోళ‌న బాబుకు అనుకోని వ‌రంలా క‌లిసొచ్చింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ వైసీపీ విజ‌యాలు సొంతం చేసుకుంది. బాబు కోట కుప్పాన్ని కూల్చే దిశ‌గా సాగుతోంది. పార్టీ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్రంగానే ఉన్నా.. సంక్షేమ ప‌థ‌కాలే త‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిపిస్తాయ‌ని సీఎం జ‌గ‌న్ ఆశ‌లు పెట్టుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో పీఆర్సీ విష‌యంలో ఉద్యోగులు ఉద్య‌మానికి దిగ‌డం ఆయ‌న్ని ఇబ్బంది పెట్టే విషయ‌మే. కొత్త‌గా ప్ర‌క‌టించిన పీఆర్సీని వెన‌క్కి తీసుకోవాలని.. పాత పీఆర్సీ ప్ర‌కార‌మే జీతాలు చెల్లించాల‌ని ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. పీఆర్సీ సాధ‌న స‌మితి పేరుతో ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. ఈ విష‌యంలో జ‌గ‌న్ సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ఉద్య‌మాన్ని చ‌ల్ల‌బరిచే నిర్ణ‌యం తీసుకుంటే జ‌గ‌న్‌కు మేలు జ‌రిగేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌డీ ప్ర‌భుత్వ మొండి వైఖ‌రి కారణంగా ఒక‌వేళ స‌మ్మె జ‌రిగినా జ‌ర‌గ‌క‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉద్యోగుల ఓట్లు వైసీపీకి దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. దాదాపు ప‌దిహేను ల‌క్ష‌ల మంది ఉన్న ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల కుటుంబ స‌భ్యులు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మార‌తార‌న్న టాక్ వినిపిస్తోంది. ఇది బాబుకు ఆనందాన్నిచ్చే విష‌య‌మే. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం అయిదు ల‌క్ష‌ల ఓట్ల‌తోనే తాము ఓడిపోయామ‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉద్యుగులు, పింఛ‌ను దారులు త‌మ‌కు అండ‌గా నిలుస్తార‌ని బాబు విశ్వ‌సిస్తున్నార‌ని స‌మాచారం.

అందుకే ఉద్యోగ సంఘాలు త‌మ ఉద్య‌మానికి ఏ రాజ‌కీయ పార్టీ మ‌ద్ద‌తు కోర‌న‌ప్ప‌టికీ బాబు త‌న సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు. ఉద్యోగుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఉగ్ర‌వాదుల్లా భావించి జైల్ల‌లో పెడుతుంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగుల ఆందోళ‌న‌తో త‌న‌కు మేలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావించిన ఆయ‌న స‌మ్మె విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.