ఆ రీమేక్ సరైన దర్శకుడి చేతిలో పెట్టారు

ఆ రీమేక్ సరైన దర్శకుడి చేతిలో పెట్టారు

తెలుగులో ఇప్పుడున్న యువ దర్శకుల్లో టేకింగ్ పరంగా వారెవా అనిపించే దర్శకుల్లో సుధీర్ వర్మ ఒకడు. ‘స్వామి రారా’ లాంటి సెన్సేషనల్ హిట్‌తో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. ఆ తర్వాత అంచనాల్ని అందుకోలేకపోయాడు. ‘దోచేయ్’, ‘కేశవ’, ‘రణరంగం’ సినిమాలతో నిరాశ పరిచాడు. ఐతే ఈ సినిమాలు ఆడకపోయి ఉండొచ్చు కానీ.. వీటిలో టేకింగ్ మాత్రం అదుర్స్ అనిపిస్తుంది.

ఒక సన్నివేశాన్ని ఎంత స్టైలిష్‌గా, అందంగా ప్రెజెంట్ చేయొచ్చో సుధీర్ వర్మకు బాగా తెలుసు అనిపిస్తుంది అతడి సినిమాలు చూస్తే. కానీ సరైన కథలు ఎంచుకోక, స్క్రిప్టు మీద దృష్టిపెట్టక అతడి సినిమాలు తేలిపోయాయి. ఈ మధ్యే వచ్చిన ‘రణరంగం’లోనూ సుధీర్ స్టైలిష్ టేకింగ్ ప్రశంసలందుకుంది. ఈ దర్శకుడి చేతికి మంచి స్క్రిప్టు వస్తే.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా బాగా ప్రెజెంట్ చేయగలడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు సుధీర్‌కు అలాంటి అవకాశమే వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తొలిసారిగా కెరీర్లో ఒక రీమేక్ మూవీ తీయబోతున్నాడట సుధీర్. హిందీలో గత ఏడాది సూపర్ హిట్టయిన థ్రిల్లర్ మూవీ ‘అంధాదున్’ను తెలుగులో రీమేక్ చేసే దర్శకుడు సుధీరేనట. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. తన కొడుకుతో ఈ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీనికి సరైన దర్శకుడు ఎవరా అని ఆలోచించి సుధీర్‌ను ఎంచుకున్నారట తండ్రీ కొడుకులు.

అంధాదున్ థ్రిల్లర్ జానర్లో మోడర్న్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అనూహ్య మలుపులతో ఉత్కంఠకు గురి చేస్తూ చాలా స్టైలిష్‌గా సాగిపోతుందీ సినిమా. దీన్ని సుధీర్ లాంటి దర్శకుడు మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి అవకాశముంది. కాస్త తన టచ్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తీయగలిగితే సినిమా హిట్టవడమే కాక సుధీర్‌కూ మంచి పేరొచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English