కథ, నిర్మాణం: మణిరత్నం.. సంగీతం: సిద్ శ్రీరామ్

కథ, నిర్మాణం: మణిరత్నం.. సంగీతం: సిద్ శ్రీరామ్

తమిళంలో ఒక ఆసక్తికర సినిమాకు రంగం సిద్ధమైంది. మణిరత్నం కథ అందిస్తూ ఒక సినిమాను తన 'మద్రాస్ టాకీస్' బేనర్ మీద నిర్మిస్తుండగా.. ఆ చిత్రానికి సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ సంగీతం అందించనున్నాడు. మణిరత్నం ఒక సినిమాకు కథ ఇచ్చి తనే నిర్మించడం అరుదైన విషయమే. సిద్ సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఆ సినిమా పేరు.. వానం కొట్టటుం.

భార్యాభర్తలైన సీనియర్ ఆర్టిస్టులు శరత్ కుమార్, రాధిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. అతడికి జోడీగా తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ కనిపించనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు చాలా ప్లెజెంట్‌గా ఉండటం ఒక పాజిటివ్ ఫీలింగ్ తెస్తున్నాయి. ఒక క్లాసిక్ మూవీ చూడబోతున్నామనే భావన కలిగిస్తున్నాయి ఈ పోస్టర్లు. ధన అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

మణిరత్నం గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన 'గాయం' చిత్రానికి కథ అందించడం విశేషం. ఆ తర్వాత 90ల్లో ఇంకో మరికొన్ని సినిమాలకు కథ ఇచ్చాడు. కొన్ని సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ తన కథతో సినిమా నిర్మిస్తున్నాడు. ఇక 'ఇంకేం ఇంకేం కావాలే'.. 'అందం అమ్మాయైతే'.. 'మాటే వినదుగ'.. 'సామజవరగమన' లాంటి పాటలతో కుర్రకారును ఊపేస్తున్న సిద్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడంటే దానిపై ప్రత్యేక ఆసక్తి నెలకొనడం ఖాయం. ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English