ఆత్రేయ రీమేక్‌కు అతను ఫిక్స్

ఆత్రేయ రీమేక్‌కు అతను ఫిక్స్

ఈ ఏడాది తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండా, చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి. ఇంతకుముందు చిన్న చిన్న పాత్రలే చేసిన నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో హీరోగా మారి తన టాలెంట్ అంతా చూపించాడు. అసలేమాత్రం కొత్త హీరో నటించిన సినిమాలా అనిపించలేదీ చిత్రం. నూతన దర్శకుడు స్వరూప్ తొలి  సినిమాతోనే తన పనితనం చూపించాడు.

తెలుగు తెరపై ఇంతకుముందెన్నడూ చూడని కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. కొత్త కథ కావడం, తెలుగులో మంచి విజయం సాధించడంతో వేరే భాషల వాళ్లకూ ఈ సినిమాపై ఆసక్తి పుట్టింది. ముందుగా ఈ కథ తమిళంలోకి వెళ్లబోతున్నట్లు సమాచారం.

కమెడియన్‌కు తిరుగులేని స్థాయిని అందుకుని ఆ తర్వాత హీరోగా మారి వరుసగా సినిమాలు చేసుకుపోతున్న సంతానం తమిళ ‘ఆత్రేయ’గా మారబోతున్నట్లు తెలుస్తోంది. మన సునీల్ తరహాలోనే సంతానం సైతం కమెడియన్‌గా పీక్స్‌లో ఉండగా హీరోగా మారాడు. సునీల్ లాగే కమెడియన్‌గా అతడి కెరీర్ దెబ్బ తింది. ఐతే మనోడిలా అతను హీరోగా దెబ్బ తినలేదు. సూపర్ సక్సెస్ అయిపోయాడని చెప్పలేం కానీ.. తనకు నప్పే కామెడీ కథలు ఎంచుకుని హీరోగా ఓ మోస్తరు స్థాయిలో సాగిపోతున్నాడతను.

ఈ మధ్యే వచ్చిన ‘రాజు గారి గది-3’ తమిళ వెర్షన్లోనూ అతనే హీరో. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి కామెడీ టచ్ ఉన్న థ్రిల్లర్ మూవీ సంతానంకు బాగానే సూటయ్యే అవకాశముంది. ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా ఖరారవ్వలేదు. త్వరలోనే డైరెక్టర్‌ను ఖరారు చేసి సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English