జగన్ హయాంలో అతి పెద్ద నిరసన

విజయ‌వాడ‌లోని బీఆర్‌టీఎస్ రోడ్డు.. ఇసుక వేస్తే రాల‌నంత‌గా జ‌నం. ఆకాశం బ‌ద్ద‌లై ఉడిప‌డ్డ‌రా.. నేల ఈనిందా అన్న‌ట్లుగా క‌నుచూపు మేర ప్ర‌జ‌లే. ఎవ‌రు వీళ్లంతా అనుకోవ‌ద్దు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొత్త పీఆర్సీకి వ్య‌తిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు. ఆ జీవోల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని పాత జీతాల‌నే ఇవ్వాల‌నే డిమాండ్‌తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్య‌మానికి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ నెల 6 అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు వెళ్తామ‌ని పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌లు నోటీస్ ఇచ్చిన విష‌యం విదిత‌మే. త‌మ ఆందోళ‌న‌లో భాగంగా ఈ రోజు ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. దీనికి పోలీసుల అనుమ‌తి లేద‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఉద్యోగులు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

వేలాదిగా..
విజ‌య‌వాడ రాకుండా ఉద్యోగుల‌కు పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డా అడ్డుకున్న‌ప్ప‌టికీ వాళ్ల క‌ళ్లుగ‌ప్పి వేలాది మంది బీఆర్‌టీఎస్ రోడ్డు చేరుకున్నారు. ఆ ర‌హ‌దారి మొత్తం ఉద్యోగుల‌తో నిండిపోయింది. అక్క‌డ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కుల త‌ల‌పెట్టినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ట్రాలీ ఆటోలు ఎక్కి వాళ్లు మాట్లాడుతున్నారు. భారీ సంఖ్య‌లో ఉద్యోగులు రావ‌డంతో విజ‌య‌వాడ రోడ్ల‌న్నీ కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌తో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లతో పాటు ఇత‌ర కార్మికులు కూడా పెద్ద ఎత్తున అక్క‌డికి చేరుకున్నారు.

తీవ్ర ఉద్రిక్త‌త‌..
ఛ‌లో విజ‌య‌వాడ‌కు ఉప్పెన‌లా ఉద్యోగులు త‌ర‌లివ‌చ్చారు. రోడ్ల‌పై క‌దం తొక్కుతున్నారు. బెజవాడ మొత్తం వాళ్ల నినాదాల‌తో, భారీ ర్యాలీల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. ఎన్జీఓ హొం స‌ర్కిల్ నుంచి ప్రారంభ‌మైన ఉద్యోగుల ర్యాలీ బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు చేరుకుంది. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పీఆర్సీ సాధ‌న స‌మితికి సంబంధించిన ఎర్ర జెండాలు చేతిలో ప‌ట్టుకుని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. మ‌రోవైపు గుడివాడ నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరిన ఉద్యోగ సంఘాల కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేష‌న్లు, బ‌స్‌స్టాండ్ల వ‌ద్దే ఉద్యోగుల‌ను అడ్డుకుంటున్నారు.

మారువేషాల్లో..
మ‌రువేషాల్లో ఉద్యోగులు రెండు మూడు రోజుల ముందే విజ‌య‌వాడ చేరుకున్నారు. అంగ‌వైక‌ల్యం నుంచి వ్య‌క్తులుగా, కూలీలుగా మారి బెజ‌వాడకు వ‌చ్చారు. క‌ర్నూలు జిల్లాకు అనంత‌పురానికి చెందిన ఉపాధ్యాయులంతా పెళ్లి బ‌స్సులో విజ‌య‌వాడ‌కు బ‌య‌ల్దేరడం విశేషం. వాళ్ల‌ను ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు ప‌ట్ట‌ణ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యోగులు విజ‌య‌వాడ చేరి త‌మ ఆందోళ‌న‌ను విజ‌య‌వంతం చేసిన‌ట్లు క‌నిపిస్తున్నారు. ఇంత తీవ్ర‌త ఊహించ‌ని సీఎం జ‌గ‌న్‌కు ఇది క‌చ్చితంగా క‌నువిప్పులా మారుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.