ముఖం మీదే బాలేదని అనడంతో రజనీ నొచ్చుకున్నాడట

ముఖం మీదే బాలేదని అనడంతో రజనీ నొచ్చుకున్నాడట

తమిళ సినిమాకు సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌లను రెండు కళ్లుగా చెప్పొచ్చు. వీళ్లిద్దరిలో ఎవరికి వాళ్లే సాటి. ఇద్దరూ నటనలో, స్టార్ ఇమేజ్‌లో తిరుగులేని స్థాయిని అందుకున్నారు. ఐతే ఒకరికొకరు పోటీ అయినా సరే.. ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. రజనీ, కమల్ ఇద్దరూ బాలచందర్ స్కూల్ నుంచే వచ్చారు. మొదట్లో కలిసి సినిమాలు చేశారు. ఆ తర్వాత ఇద్దరి దారులు భిన్నంగా సాగినప్పటికీ.. స్నేహం మాత్రం కొనసాగుతూ ఉంది.

ఇద్దరూ వేర్వేరుగా పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నప్పటికీ ఆ స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా కమల్ హాసన్ తన గురువు బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆ వేడుకకు రజనీ వచ్చాడు. కమల్‌తో కలిసి బాలచందర్‌కు నివాళి అర్పించాడు.

ఈ సందర్భంగా తమ స్నేహ బంధం గురించి కమల్ ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు. రజనీ కెరీర్లో మైలరాయిలా నిలిచిపోయిన 'దళపతి' సినిమా నాటి సంగతుల్ని ఆయన పంచుకున్నాడు. తాను మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని తనకే ముందుగా చెప్పిన రజనీ.. ఆ సినిమా పేరు 'దళపతి' అనే పేరు పెడుతున్నట్లు చెప్పాడని కమల్ తెలిపాడు.

ఐతే ఆ టైటిల్ వినగానే తనకు నచ్చలేదని.. రజనీ మీద కోపం వచ్చిందని చెప్పాడు కమల్. ముఖం మీదే బాలేదని అనడంతో రజనీ నొచ్చుకున్నాడని.. ఐతే రజనీ చెప్పిన టైటిల్ తనకు 'దళపతి' అని కాకుండా 'గణపతి' అని వినిపించిందని.. అందుకే ఆ టైటిల్ బాగా లేదని అన్నానని కమల్ తెలిపాడు. ఏదో వినాయక చవితి పండగలా ఉందని కూడా కామెంట్ చేశాడని.. దీంతో రజనీకి అర్థం కాక మరోసారి టైటిల్ గురించి వివరిస్తే అప్పుడు తనకు 'దళపతి' అని అర్థమై చాలా బావుందని చెప్పానని కమల్ వెల్లడించాడు. కొన్నేళ్ల కిందట రజనీ సినిమాలు మానేద్దామనుకుంటున్నట్లు తనతో చెబితే.. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని తాను స్పష్టం చేశానన్నాడు కమల్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English