రజనీనే కాదు.. కమల్ కూడా

రజనీనే కాదు.. కమల్ కూడా

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోగానే అక్కడ సినిమా స్టార్లందరికీ రాజకీయాలపైకి మనసు మళ్లింది. జయ ఉన్నంత కాలం అసలు తమకు రాజకీయాల్లో వచ్చే ఉద్దేశాలే లేవన్నట్లుగా కనిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌లకు.. ఆమె వెళ్లిపోగానే ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయాలన్న ఆలోచన పుట్టింది. ఒకరి తర్వాత ఒకరు రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించారు.

కమల్ రెండేళ్ల కిందటే పార్టీ పెట్టి జనాల్లో తిరుగుతుంటే రజనీ మాత్రం పార్టీ పెట్టబోతున్నట్లు మాత్రం ప్రకటించి ఊరుకున్నారు. ఇద్దరూ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయకుండా పార్ట్ టైం పొలిటీషియన్లలా కనిపిస్తుండటం జనాలకు రుచించడం లేదు. ఉన్నంతలో కమల్ నయం. కనీసం పార్టీ అయినా పెట్టాడు. అంతో ఇంతో జనాల్లో తిరుగుతున్నాడు. కానీ రజనీ వ్యవహారం మాత్రం టూమచ్చే.

లోక్‌సభ ఎన్నికలొస్తున్నా పార్టీని ప్రకటించలేదు. ఆ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండిపోయాడు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసమైనా సన్నద్ధం అవుతాడనుకుంటే.. దాని సంగతి వదిలేసి ఏదో కరవులో పడ్డట్లుగా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఎన్నికలకు ఏడాది ముందు కూడా పార్టీ పెట్టకుండా, జనాల్లోకి వెళ్లకుండా ఇలా సినిమాలు చేసుకుపోవడమేంటో అర్థం కావడం లేదు. ఇక కమల్ విషయానికి వస్తే ఇక సినిమాలు చేయను అనే మాటను ఆయన కూడా తప్పారు.

కొంచెం గ్యాప్ తర్వాత ‘భారతీయుడు-2’ సినిమాలో నటిస్తున్నాడు. తన రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాల గురించి చెప్పడానికి ఈ సినిమాను ఉపయోగించుకుంటున్నాడేమో.. దీని తర్వాత ఇంకో సినిమా చేయడేమో అనుకున్నారు కానీ.. కమల్ ఆలోచన అలా లేదు. ఆయన కూడా రజనీ మాదిరే సినిమాలు ఆపట్లేదు. ‘భారతీయుడు-2’ తర్వాత ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో సొంత బేనర్లో ఓ సినిమా చేయడానికి కమల్ రెడీ అయ్యాాడట. ప్రస్తుతం విజయ్ హీరోగా సినిమాను మొదలుపెడుతున్న లోకేష్.. దీని తర్వాత కమల్‌తోనే సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English