ఎట్ట‌కేల‌కు వ‌స్తున్నాడు విక్ర‌మ్ వార‌సుడు

ఎట్ట‌కేల‌కు వ‌స్తున్నాడు విక్ర‌మ్ వార‌సుడు

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఎలా అయితే త‌న‌ అరంగేట్ర సినిమా రేయ్ విష‌యంలో ఇబ్బంది ప‌డ్డాడో త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ కొడుకు ధ్రువ్ సైతం త‌న తొలి చిత్రం విష‌యంలో సంక‌ట స్థితిని ఎదుర్కొన్నాడు.

ఇత‌డికి చాలా భిన్న‌మైన క‌ష్టం. తెలుగులో క‌ల్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న అర్జున్ రెడ్డి రీమేక్ భారాన్ని అత‌డి నెత్తిన పెట్టి అయోమ‌య స్థితికి నెట్టాడు తండ్రి విక్ర‌మ్. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ బాల తీసిన ఒక వెర్ష‌న్ న‌చ్చ‌క దాన్ని ప‌క్క‌న ప‌డేయ‌డం.. ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన గిరీశ‌య్య‌తో మ‌ళ్లీ సినిమా తీయించ‌డం.. దానికి కూడా సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో సినిమా విడుద‌ల‌పై, ధ్రువ్ భ‌విత‌వ్యంపై అయోమ‌యం నెల‌కొన‌డం తెలిసిన సంగ‌తే.

ఐతే మ‌ళ్లీ మార్పులు చేర్పులు చేయ‌డం, ఇంకో వెర్ష‌న్ తీయ‌డం సాధ్యం కాని ప‌ని అని.. ఇప్పుడు తీసిన సినిమానే రిలీజ్‌కు రెడీ చేసేశారు. అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌ర్వాత ఈ శుక్ర‌వార‌మే ఆదిత్య వ‌ర్మ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. సినిమాను ప్ర‌మోట్ చేయ‌డానికి స్వ‌యంగా కొడుకుతో క‌లిసి విక్ర‌మే రంగంలోకి దిగాడు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో సినిమాను అగ్రెసివ్‌గా ప్ర‌మోట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోతో ప్రేమ‌లో ప‌డే సినీ హీరోయిన్ పాత్ర‌లో న‌టించిన ప్రియా ఆనంద్ కూడా వీళ్ల‌కు తోడైంది. మ‌రి ఎన్నో సందేహాల మ‌ధ్య విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి స్పంద‌న రాబ‌ట్టుకుంటుందో.. ధ్రువ్ కెరీర్‌కు ఎలాంటి ఆరంభాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English