కోలీవుడ్‌లో బిగిల్ రచ్చ‌... విజ‌య్ ఫ్యాన్స్ విధ్వంసం

కోలీవుడ్‌లో బిగిల్ రచ్చ‌... విజ‌య్ ఫ్యాన్స్ విధ్వంసం

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందిన బిగిల్ (తెలుగులో విజిల్) నేడు విడుదలైంది. ఇప్ప‌టికే విజ‌య్ - అట్లీ కాంబోలో వ‌చ్చిన తెరీ (పోలీసోడు), మెర్స‌ల్ (అదిరింది) సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమా కూడా హ్యాట్రిక్ కొడుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అయితే త‌మిళ‌నాడు స‌ర్కార్ ముందు నుంచి బిగిల్‌ను ఎందుకో ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసింది. ఈ క్ర‌మంలోనే బిగిల్ ప్రీమియ‌ర్ షోల‌కు చివ‌రి వ‌ర‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేదు.

ఇక గ‌త అర్ధ‌రాత్రి ప్రీమియ‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేద‌ని విజ‌య్ అభిమానులు ఎక్క‌డిక‌క్క‌డ రెచ్చిపోయారు. తమిళనాడులోని కృష్ణగిరిలో విజయ్ అభిమానులు నానా ర‌చ్చ చేశారు. బీభత్సం సృష్టించారు. కృష్ణ‌గిరిలో సినిమా హాల్ ధ్వంసం చేయ‌డంతో పాటు స‌మీపంలో ఉన్న దుకాణాల‌కు నిప్పు పెట్టారు. ఒక్క‌సారిగా ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో చివ‌ర‌కు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేయాల్సి వ‌చ్చింది.

పోలీసులు రంగంలోకి దిగ‌డంతో విజ‌య్ అభిమానులు మ‌రింత‌గా రెచ్చిపోయారు. మునిసిపాలీటికి చెందిన వాహ‌నాలకు నిప్పు పెట్ట‌డంతో పాటు ప‌క్క‌నే ఉన్న వాహ‌నాల‌ను సైతం ధ్వంసం చేశారు. బిగిల్ స్పెష‌ల్ షోలు వేయాల్సిందే న‌ని వారు నినాదాలు చేశారు. చివ‌ర‌కు స్పెష‌ల్ ఫోర్స్ రంగంలోకి దిగ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక విజ‌య్ డ్యూయ‌ల్ రోల్ చేసిన ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌. తెలుగులో ఈ సినిమాను మ‌హేష్ ఎస్‌.కోనేరు ఈస్ట్‌కోస్ట్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఇక్క‌డ విజిల్ పేరుతో రిలీజ్ అయ్యింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English