ఆ కాంఛన వద్దు.. ఈ గదీ వద్దు బాబోయ్

ఆ కాంఛన వద్దు.. ఈ గదీ వద్దు బాబోయ్

అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఒక జానర్లో ఓ సినిమా సూపర్ హిట్టయిందంటే చాలు.. ఇక వరుసబెట్టి అందరూ ఆ మార్గంలోనే కాసులు కొల్లగొట్టేయాలని చూస్తుంటారు. వరుసబెట్టి ఒకే రకమైన సినిమాలు వదిలేస్తుంటారు. ప్రేక్షకులకు కొంత కాలానికే మొహం మొత్తేస్తుంది. హార్రర్ కామెడీల సంగతి కూడా అలాగే తయారైంది. ‘ప్రేమకథా చిత్రమ్’, ‘కాంఛన’ లాంటి కొన్ని సినిమాలు ఆడేశాయని ఆ తర్వాత కొన్నేళ్లలో తెలుగులో హార్రర్ కామెడీలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేశాయి. ఇవి చాలవన్నట్లు తమిళ అనువాదాలు కొన్ని కొన్ని దించేశారు.

ఐతే ఒక దశ దాటాక హార్రర్ కామెడీ జనాలకు మొహం మొత్తేసింది. ఒకే రకం కథల్ని అటు తిప్పి ఇటు తిప్పి తీయడం మొదలుపెట్టారు. దెబ్బకు ఈ జానర్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. తాజాగా ‘రాజు గారి గది-3’ సినిమా చూసిన ప్రేక్షకులకు ఇక ఈ జానర్లో సినిమాలు ఆపేస్తే మంచిదన్న అభిప్రాయం కలిగించింది.

‘ప్రేమకథా చిత్రమ్’తో మొదలై...

తెలుగులో హార్రర్ కామెడీ చిత్రాలకు ఊపు తెచ్చిన సినిమా ‘ప్రేమకథా చిత్రమ్’. మారుతి రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. దీంతో హార్రర్ కామెడీ జానర్లో సినిమాలు వరుస కట్టేశాయి. మారుతి కంటే ముందు లారెన్స్ ఈ జానర్లో ‘ముని’ సినిమా తీసినా అదంతగా ఆడలేదు. కానీ దానికి కొనసాగింపుగా తీసిన ‘కాంఛన’ మాత్రం పెద్ద హిట్టయింది.

మొత్తం ఇండియాలో ఈ జానర్‌ జోరు పెరిగేలా చేసింది. ఆ తర్వాత ‘గీతాంజలి’, ‘గంగ’, ‘చంద్రకళ’ లాంటి సినిమాలెన్నో వచ్చాయి. బాగానే ఆడాయి. కానీ ఈ జానర్లో సినిమాలన్నీ ఒకే తరహా కథలతో తెరకెక్కడంతో నెమ్మదిగా ఆసక్తి పోతూ వచ్చింది. మధ్యలో ‘ఆనందో బ్రహ్మ’ సినిమా హార్రర్ కామెడీ జానర్లోనే కొత్తదనం చూపించి ఆకట్టుకుంది కానీ.. ఇంకెవరూ ఇలాంటి భిన్నమైన ప్రయత్నాలు చేయలేదు. ఈ ఏడాది ఈ జానర్లో వచ్చిన సినిమాలేవీ కూడా ఆడలేదు. ‘ప్రేమకథా చిత్రమ్-2’ అయితే ఈ జానర్ అంటేనే కంగారు పడే పరిస్థితి తెచ్చిపెట్టింది.

రెండూ తుస్సే..

హార్రర్ కామెడీల పితామహుడిగా పేరు తెచ్చుకున్న లారెన్స్ సైతం ఈ ఏడాది ‘కాంఛన-3’తో అలరించలేకపోయాడు. మాస్ జనాలు ఆ సినిమాను ఓ మోస్తరుగా చూశారు కానీ.. అందులో విషయం తక్కువ, హడావుడి ఎక్కువ అన్న విషయంలో మరో మాట లేదు. ఇంతకుముందులా ప్రేక్షకుల్ని భయపెట్టడంలో, నవ్వించడంలో లారెన్స్ అనుకున్న స్థాయిలో మెప్పించలేదు. సినిమా మరీ రొటీన్‌గా ఉండి హార్రర్ కామెడీ మీద జనాలకు మొహం మొత్తేలా చేసింది.

ఇక తెలుగులో ఈ జానర్లో వరుసగా సినిమాలు తీస్తున్న ఓంకార్ సైతం ‘రాజు గారి గది-3’తో చేతులెత్తేసినట్లే కనిపించాడు. అతను తొలి సినిమాలో మాత్రం తన టాలెంట్ చూపించాడు. రెండోది రీమేక్. ఉన్నంతలో బాగానే తీసినా ఆడలేదు. ఇప్పుడు ఓ తమిళ సినిమాను పట్టుకొచ్చి మసాలా అద్దాడు. మరీ వల్గర్‌గా ఉన్న కామెడీ సినిమాను మాస్ సెంటర్లలో కాస్త కాపాడింది. ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పడానికేమీ లేదు. మరీ రొటీన్‌గా సాగిపోయిన ఈ చిత్రం తెలుగులో హార్రర్ కామెడీ జానర్‌కు దాదాపుగా తెరదించేసిందంటే అతిశయోక్తి లేదు. ‘కాంఛన’ సిరీస్‌లో, ‘రాజు గారి గది-3’ సిరీస్‌లో పదేసి సినిమాలు వస్తాయని వాటి మేకర్స్ గొప్పలు పోయారు కానీ.. ఇకపై ఈ వరుసలో ఇంకొక్క సినిమా తీసినా వర్కవుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English