ప్రభాస్ క్రేజుని ఫుల్లుగా వాడేస్తున్నారు

బాహుబలి అనే ఒకే సినిమాతో ప్రభాస్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒక్క సినిమాతో ఇంతలా ఎదిగిపోయిన హీరోలు ఇండస్ట్రీ ఫిలిం హిస్టరీలోనే ఎవ్వరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ డిజాస్టర్ అయినా సరే.. అతడి క్రేజ్ ఏమీ తగ్గలేదు. ప్రభాస్‌కు డిమాండ్ ఇంకా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. అతను హీరోగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కె, స్పిరిట్ లాంటి భారీ చిత్రాలు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఇందులో ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ సినిమా విడుదలకు సన్నాహాలు భారీ ఎత్తునే జరుగుతున్నట్లు సమాచారం. ప్రభాస్ క్రేజుని పూర్తిగా వాడుకుంటూ పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాకు భారీ రిలీజ్ ప్లాన్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఏకంగా 15 భాషల్లో ‘ఆదిపురుష్’ విడుదల కాబోతోందట. అంటే దాదాపు ప్రతి ప్రధాన భాషలోనూ సినిమా రిలీజవుతుందన్నమాట. ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమాలంటే నాలుగైదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు అంతే. నార్త్ ఇండియా అంతటా హిందీలో రిలీజ్ చేసి.. సౌత్ వరకు ఇక్కడి నాలుగు ప్రధాన భాషల్లో సినిమాను విడుదల చేస్తారు. కానీ ‘ఆదిపురుష్’ రామాయణ కథతో తెరకెక్కిన నేపథ్యంలో ఆయా లోకల్ భాషల్లో అందిస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో డబ్ చేస్తున్నారట.

అలాగే ప్రపంచ స్థాయిలో కూడా ఇంగ్లిష్ మాత్రమే కాక చైనీస్, జపనీస్.. ఇలా పలు భాషల్లో సినిమాను అందించబోతున్నారట. వరల్డ్ వైడ్ ఈ చిత్రాన్ని 20 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే అత్యధిక స్క్రీన్లలో విడుదలైన భారతీయ చిత్రంగా ‘ఆదిపురుష్’ రికార్డు సృష్టించబోతోందన్నమాటే. చాలా ముందుగానే షూటింగ్ పూర్తి చేసి సుదీర్ఘ సమయం పోస్ట్ ప్రొడక్షన్ కోసం వెచ్చిస్తోంది చిత్ర బృందం. ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటించిన సంగతి తెలిసిందే.