తల్ల‌కిందులైన ఏపీ జిల్లాలు… ఎన్నిక‌ల‌పై ఎఫెక్ట్ త‌ప్ప‌దా…!

ఏపీ సర్కారు తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యంతో రాష్ట్ర స్వ‌రూపం మొత్తం త‌ల‌కిందులైంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు.. మూడు జిల్లాలు(గుంటూరు, బాప‌ట్ల‌, ప‌ల్నాడు) కానుంది. అదేవిధంగా తూర్పుగోదావ‌రి కూడా మూడు జిల్లాలు(తూర్పుగోదావ‌రి, రాజ‌మ‌హేం ద్ర‌వ‌రం, కోన‌సీమ‌) ఏర్పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల స్వ‌రూపం, జ‌నాభా విస్తీర్ణం స‌హా అనేక రూపాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ‌లితంగా ఆ జిల్లాల మౌలిక స్వ‌రూప‌మే కాకుండా.. అస్థిత్వం కూడా పోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లో భోగౌళిక విస్తీర్ణంలో ఒంగోలు జిల్లా టాప్‌లో నిలిచింది. 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ జిల్లా విస్తరించి ఉంది. రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 8.8 శాతం ఈ ఒక్క జిల్లాలోనే ఉంది. 12,251 చ.కి.మీ. విస్తీర్ణంతో అల్లూరి సీతారామరాజు జిల్లా (9.54%) రెండోస్థానంలో నిలిచింది. ఇంతకు ముందు విస్తీర్ణంలో పెద్ద జిల్లాగా ఉన్న అనంతపురం ఇప్పుడు 11,359 చ.కి.మీ.తో (7శాతం) మూడో స్థానంలో ఉంది.

 928 చ.కి.మీ. విస్తీర్ణం మాత్రమే ఉన్న విశాఖపట్నం జిల్లా (0.6%) చివరి స్థానంలో నిలవడం విశేషం. ఇక జనాభా పరంగా చూస్తే 23.66 లక్షల మందితో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాతో పాటు అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, శ్రీబాలాజీ, శ్రీకాకుళం, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలు 20 లక్షలపైనే జనాభాను కలిగి ఉన్నాయి. గిరిజన జిల్లాలైన మన్యం జిల్లాలో 9.72 లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9.54 లక్షల జనాభా ఉంది.  

14 జిల్లాల్లో ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. 10 జిల్లాల్లో మూడు చొప్పున రెవెన్యూ డివిజన్‌లున్నాయి. ఒంగోలులో అత్యధికంగా 38 మండలాలు ఉండగా నెల్లూరులో 35, శ్రీబాలాజీలో 35, అనంతపురంలో 34, కడపలో 34 చొప్పున ఉన్నాయి.

అయితే.. ఈవిభ‌జ‌న ద్వారా .. ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో కులాల ప్రాతిప‌దిక‌న ప‌లు మండలాల్లో ఓటింగ్ ప్ర‌భావం ఉండేద‌ని.. ఇప్పుడు ఇలా కులాల ప్రాతిప‌దిక‌గా బలంగా ఉన్న మండ‌లాలు చాలా వ‌ర‌కు .. వేరే మండ‌లాల్లో క‌లిసిపోవ‌డంతో ఆయా మండ‌లాల్లో.. ఎన్నిక‌ల్లో ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని.. అంటున్నారు. ఇది.. అక్క‌డ ప్ర‌జాప్ర‌తినిధుల‌పైనా ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. మ‌రి దీనిని అధికార ప్ర‌తిప‌క్ష నేత‌లు ఎలా స‌మ‌న్వ‌యం చేసుకుంటారో చూడాలి.