వ‌న్ ఇయ‌ర్ త‌ర్వాత‌.. మ‌న‌దే సీఎం పీఠం: సంజ‌య్

తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని.. వారు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనలో గాయపడ్డ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎదుగుదల జీర్ణించుకోలేక.. తీవ్రమైన మానసిక ఒత్తిడితో  ఎంపీలపై దాడులు చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.

లోక్ సభ ప్రివిలైజ్‌ కమిటీకి అర్వింద్‌పై దాడి అంశాన్ని తీసుకెళ్తామని సంజయ్‌ స్పష్టం చేశారు. ఈ సంవత్సరమే టీఆర్ ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని.. తర్వాత కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “ ఒక్క సంవ‌త్స‌రం ఓపిక ప‌ట్టండి.. త‌ర్వాత‌..మ‌నదే ప్ర‌భుత్వం“ అని బండి వ్యాఖ్యానించారు. “నంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి… కేసీఆర్‌. తెలంగాణ కోసం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు ఏం త్యాగాలు చేశారు?. కేసీఆర్‌ దొంగ దీక్ష చేశారు, మమ్మల్ని ఏం చేయలేరు. దాడులు చేసినా ప్రజల కోసం భరిస్తాం“ అని వ్యాఖ్యానించారు.

“ కేసీఆర్‌ రాష్ట్రంలో అధికారంలో ఉంటే..కేంద్రంలో మేం ఉన్నాం. నిరుద్యోగ భృతి, పీఆర్సీ, పంట కొనుగోళ్లు, 317 జీవోపై బీజేపీ ప్రశ్నిస్తోందని.. దాడులకు పాల్పడటం నీచమైన చర్య. మేం దాడులు చేయడం మొదలుపెడితే బిస్తర్ కట్టాల్సిందే“ అని సంజ‌య్ కామెంట్ చేశారు. . సీఎం కార్యాలయం దర్శకత్వంలోనే దాడులు చేయించారన్నారు. ఎంపీపై దాడి జరిగితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. దాడిచేసిన అందరూ బయట తిరుగుతున్నారని సంజయ్ తెలిపారు.

తమపైనే దాడి చేసి తిరిగి తమమీదే కేసులు పెడతారని తెలుసని.. కరీంనగర్లోనూ ఇదే జరిగిందని ఆరోపించారు. టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులను కేసీఆర్ అదుపులో పెట్టుకోవాలని.. బీజేపీ నేతలను రెచ్చగొట్టొద్దని బండి సంజయ్ హెచ్చరించారు. ఎంపీ అర్వింద్‌పై దాడి ఘటనపై సీఎం స్పందించి, దాడిని ఖండించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.