దిల్ రాజును మరీ మొహమాట పెట్టేస్తున్నారే..

దిల్ రాజును మరీ మొహమాట పెట్టేస్తున్నారే..

సినీ పరిశ్రమలో మొహమాటాలకు పోతే నిండా మునగడం ఖాయం. తేడా వస్తే కోట్లకు కోట్లు పోతాయి. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న దిల్ రాజుకు ఈ విషయం తెలియంది కాదు. కెరీర్లో చాలా వరకు రాజీ లేకుండా, మొహమాటాలకు పోకుండా సినిమాలు నిర్మిస్తూ వచ్చాడాయన. తనకు ‘భద్ర’ లాంటి హిట్ ఇచ్చినప్పటికీ.. ఒక సినిమా కోసం ఎక్కువ పారితోషకం అడిగాడని ప్రారంభోత్సవం కూడా జరుపుకున్నాక రవితేజ సినిమాను ఆపేశాడాయన.

తన బేనర్లో రాజ్ తరుణ్ హీరోగా తీసిన ‘లవర్’ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టేయడాన్ని తప్పుబడుతూ ప్రెస్ మీట్లోనే తన మేనల్లుడు హర్షిత్ మీద అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ఇంత ఓపెన్‌గా, మొహమాటం లేకుండా ఉండే రాజును ఈ మధ్య తెగ మొహమాట పెట్టేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. గతంలో తనకు జరిగిన మేళ్లు, కొన్ని భవిష్యత్ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని రాజు తనకు సెట్టవని ప్రాజెక్టుల్ని నెత్తికెత్తుకుంటున్నాడు.

‘శరభ’ అనే ఫ్లాప్ మూవీ తీసిన నరసింహారావు దర్శకత్వంలో దర్శకుడు వి.వి.వినాయక్ హీరోగా రాజు ‘సీనయ్య’ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక్ హీరో ఏంటి.. రాజు నిర్మాత ఏంటి అనిపిస్తుంది కానీ.. ‘దిల్’ సినిమాతో తాను నిర్మాతగా నిలదొక్కుకోవడానికి కారణమైన వినాయక్‌‌కు హీరో ముచ్చట తీర్చడానికి రాజు ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మధ్యే రాజు తనకు బాగా పరిచయమున్న యువ నటుడు రాకేష్ వర్రె కోసం అతను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే సినిమాను టేకప్ చేశాడు.

ఆ సినిమానే రాజు స్థాయికి చాలా తక్కువ అనుకుంటే.. ఇప్పుడు బిత్తిరి సత్తి హీరోగా తెరకెక్కిన ‘తుపాకి రాముడు’ అనే చిత్రాన్ని తన బేనర్ మీద రిలీజ్ చేస్తున్నాడు. ప్రేక్షకుల్లో ఏమంత ఆసక్తి లేని ఇలాంటి చిత్రాన్ని రాజు రిలీజ్ చేయడమేంటి అనిపిస్తుంది. ఐతే ఈ చిత్రాన్ని నిర్మించింది ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనే విషయం గుర్తుంచుకోవాలి.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో ముందు నుంచి రాజు సఖ్యతతో మెలుగుతున్నాడు. ఆయన సినిమాలకు అదనపు షోలు పడాలన్నా, టికెట్ల రేట్లు పెంచుకోవాలన్నా ప్రభుత్వ సహకారం చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజు దీన్నొక ఆబ్లిగేషన్‌గా భావించి తన బేనర్లో రిలీజ్ చేస్తున్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English