ఆలీ.. ఎందుకంత ఫ్రస్టేషన్?

ఆలీ.. ఎందుకంత ఫ్రస్టేషన్?

కమెడియన్ ఆలీ చాన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఒకప్పుడు చేతి నిండా ఆలీకి సినిమాలుండేవి. దీనికి తోడు సినిమా వేడుకల్లోనూ తళుక్కుమనేవాడు. కొన్నిసార్లు శ్రుతి మించిన వ్యాఖ్యలతో ఆయన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఆలీ గతంలో చేసి ‘సెక్సీ’ కామెంట్లు ఒక రకం అయితే.. ఇప్పుడు తాను నటించిన ‘రాజు గారి గది-3’ సినిమాకు నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన సమీక్షకుల మీద ఫైర్ అయిపోవడం.. వాళ్లను బోకులని, కోన్ కిస్కా గొట్టం గాళ్లని అనడంతో వివాదం రాజుకుంది.

గతంలోనూ సమీక్షకుల్ని విమర్శించిన వాళ్లున్నారు కానీ.. భాష ఇలా ఉండేది కాదు. ఇప్పటిదాకా హీరోలు, దర్శక నిర్మాతలు మాత్రమే ఇలా సమీక్షకులపై విమర్శలు గుప్పించేవాళ్లు. కానీ సినిమాలో ఒక పాత్ర చేసిన కమెడియన్ ఇంతగా ఫ్రస్టేట్ అయిపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. అదేమీ అతడి సొంత సినిమా కూడా కాదాయె.

ఐతే ఆలీ ఇంతగా అసహనానికి గురి కావడానికి దెబ్బ తిన్న ఆయన కెరీర్ ఒక కారణంగా కనిపిస్తోంది. ఒకప్పుడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో హవా సాగిస్తూ వచ్చిన ఆలీకి.. గత రెండు మూడేళ్లుగా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆయన తరహా కామెడీ ఈ తరం ప్రేక్షకులకు రుచించడం కష్టమే. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి వాళ్లు ఈ ట్రెండుకు తగ్గ సటిల్ కామెడీతో ఆకట్టుకుంటున్నారు. బ్రహ్మానందం లాంటి దిగ్గజానికే ఇప్పుడు అవకాశాలు లేవు. ఆలీ పరిస్థితి కూడా అలాగే తయారైంది.

తనకు అవకాశాలు రాకపోవడం మీద ఇండస్ట్రీ జనాల దగ్గర కూడా వాపోవడం, పోసాని లాంటి వాళ్లు బహిరంగంగానే ఆలీ బాధ గురించి ఒక వేడుకలో మాట్లాడ్డం గుర్తుండే ఉంటుంది. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఇంత ఖాళీ అయిపోవడం పట్ల ఆలీ అసంతృప్తితో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఓంకార్ పిలిచి ‘రాజు గారి గది-3’లో కాస్త కీలకమైన పాత్రే ఇచ్చాడు. ఈ సినిమాతో మళ్లీ తనకు పేరొచ్చి అవకాశాలు పెరుగుతాయనుకుంటే.. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇందులోని జుగుప్సాకరమైన కామెడీ గురించి విమర్శకులు ఏకిపడేశారు. ఇది చిత్ర బృందానికి రుచించలేదు. హీరోనో, దర్శకుడో సమీక్షకుల్ని విమర్శిస్తే.. అది వాళ్లకు చాలా నెగెటివ్ అవుతుంది. ఆలీ అన్నాడంటే సీనియర్ కాబట్టి చెల్లిపోతుంది. శ్రుతిలో కొట్టుకుపోతుంది. అందుకే తను లీడ్ తీసుకుని ఇలా సమీక్షకుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English