అయితే తగ్గబోయేది మహేషే అన్నమాట

అయితే తగ్గబోయేది మహేషే అన్నమాట

సంక్రాంతికి సై అంటే సై అన్న పందెం కోళ్లు రెండూ అదే మాటకు కట్టుబడి ఉంటాయా.. లేక ఏదైనా తగ్గుతాయా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకైతే 'అల వైకుంఠపురములో' యధావిధిగా జనవరి 12న వస్తుందని.. 'సరిలేరు నీకెవ్వరు'నే ఒక రోజు ముందు రిలీజ్ చేస్తారని.. ఈ మేరకు ఇరు చిత్రాల నిర్మాతల మధ్య ఒప్పందం కుదిరిందని.. బయ్యర్లకు కూడా సమాచారం అందిందని అంటున్నారు.

కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించట్లేదు. ఐతే సోషల్ మీడియాలో కూడా ఈ రకమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి రిలీజ్ డేట్ ప్రకటించాక 'సరిలేరు నీకెవ్వరు' టీం.. మళ్లీ రిలీజ్ డేట్‌తో ఏ పోస్టర్ వదల్లేదు. సినిమాకు సంబంధించిన ఏ అప్ డేట్‌లోనూ రిలీజ్ డేట్ హ్యాష్ ట్యాగ్‌ను జోడించలేదు.

అదే సమయంలో 'అల వైకుంఠపురములో' టీం మాత్రం జనవరి 12న రిలీజ్ అంటూ పోస్టర్లలో ఊదరగొట్టేస్తోంది. హ్యాష్ ట్యాగ్స్‌లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోంది. ఇది చూసి మహేష్ అభిమానులేమో.. తమ హీరో కూడా ఇదే దూకుడు చూపించాలని కోరుకుంటున్నారు. కానీ సోమవారం 'సరిలేరు నీకెవ్వరు' గురించి ఒక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం అలాంటి సంకేతం ఏమీ ఇవ్వలేదు. సినిమాలో విలన్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయిందంటూ చెస్ బోర్డుతో ఉన్న ఒక పిక్ ట్విట్టర్లో పెట్టాడు అనిల్.

ఆ ఫొటో కింద హ్యాష్ ట్యాగ్స్‌లో సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి పక్కా అని చెప్పారు తప్ప.. డేట్ గురించి ప్రస్తావించలేదు. ఒకే రోజు రెండు భారీ చిత్రాలు పోటీ పడటం వల్ల ఇరువురికీ నష్టం అన్నది స్పష్టం. గంటన్నర తేడానే అయినప్పటికీ జనవరి 12ను రిలీజ్ డేట్‌గా ముందు ప్రకటించింది 'అల..' టీమే. కాబట్టి ఆ డేటును వాళ్లకు ఇచ్చేసి తాము ఒక రోజు ముందు రావడానికి మహేష్ సినిమా టీం సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English